పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో దశాబ్దాలుగా ఇండియన్ సినిమాని రీ డిఫైన్ చేసిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో డైరెక్టర్‌గా ఓ మ్యూజికల్ ఫాంటసీ మూవీని రూపొందిస్తున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి ‘సింగ్ గీతం’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ టీజర్‌ను రిలీజ్ చేశారు. కుబేరపురం గ్రామంలో ప్రతాప్ అనే యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతాప్ జీవితం అనుకోని మార్గంలోకి వెళ్తుంది. కనిపించేదంతా నిజం కాని ప్రపంచంలోకి అతను అడుగుపెడతాడు.
అభివృద్ధి, పరిరక్షణ మధ్య జరిగే సంఘర్షణలో చిక్కుకుని, తన నిర్ణయాలు, నమ్మకాలు, లక్ష్యాలను ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. యంగ్ లీడ్ కాస్ట్ అయిన ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. తులసి, బెనర్జీ, శివనారాయణ ఇతర పాత్రల్లో కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.
యూనిక్ కాన్సెప్ట్, ఫాంటసీ కథనంతో ‘సింగ్ గీతం’ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందించబోతుందని మేకర్స్ తెలియజేశారు. జూన్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
