- హాజరైన నలుగురు సింగరేణి జీఎంలు, ఉన్నతాధికారులు
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై మంగళవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఏరియా జీఎం ఆఫీస్‌లో ఆన్యువల్ ప్లాన్ కమిటీ, టార్గెట్ కమిటీ ఆఫీసర్లు పలు అంశాలపై చర్చించారు.
ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో సింగరేణి కార్పొరేట్ జీఎంలు దేవేందర్, నరసింహారావు, వీరభద్రయ్య, డీజీఎం గ్రాబియేల్ రాజు, గని మేనేజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2026–27, 2027–28 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా టార్గెట్లపై సమీక్షించారు. 2026–27లో ఇప్పటివరకు సాధించిన బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ (ఓబీ) తొలగింపు పురోగతితో పాటు రానున్న నెలల్లో సాధించాల్సిన లక్ష్యాలపై చర్చించారు.
ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపు, భూగర్భ గనుల్లో అభివృద్ధి, డిప్లరింగ్ పనుల పురోగతిని పరిశీలించారు. అలాగే గనుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉత్పాదకత, భారీ యంత్రాల పనితీరు, వాటి సామర్థ్య వినియోగంపై ఆఫీసర్లు సూచనలు చేశారు. గనుల విస్తరణకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పర్యావరణ, అటవీ అనుమతులపై సమీక్షించారు.
లక్ష్య సాధనలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన వనరులు, సహకారం అందిస్తామని కార్పొరేట్ జీఎంలు హామీ ఇచ్చారు. మీటింగ్‌లో గనుల ఏజెంట్లు, ప్రాజెక్టు ఆఫీసర్లు, మేనేజర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
