కరోనా ​సెంటర్​గా  సింగరేణి ఏరియా హాస్పిటల్

కరోనా ​సెంటర్​గా  సింగరేణి ఏరియా హాస్పిటల్


రామకృష్ణాపూర్/మందమర్రి, వెలుగు:  సింగరేణి ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతి రోజు నిర్వహించే టెస్టుల్లో 35శాతం పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ​ కలవరపాటుకు గురిచేస్తోంది. వైరస్​ విజృంభిస్తున్న క్రమంలో దరిచేరకుండా ఓ వైపు ముందు జాగ్రత్త చర్యలపై కార్మికులకు అవగాహన కల్పిస్తున్న సింగరేణి యాజమాన్యం మరోవైపు కరోనా బారినపడిన బాధితులకు మెరుగైన ట్రీట్​మెంట్​అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. కరోనా బారిన పడిన సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన ట్రీట్​మెంట్ అందించేందుకు స్పెషల్​ కరోనా ​సెంటర్​ను అందుబాటులోకి తీసుకురానుంది.  ఇందుకోసం మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తిస్థాయి కోవిడ్​సెంటర్​గా మార్చనుంది. మరో వారం రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. 

ఫిజికల్​డిస్టెన్స్​అవకాశం లేక..

కరోనా నేపథ్యంలో ఫిజికల్​డిస్టెన్స్​పాటించాల్సి ఉన్నా.. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆ ఆవకాశం లేదు. గనులపై హాజరు వేసుకునే టైమ్​నుంచి గనిలోకి దిగేవరకు గుంపులుగానే వెళ్లాల్సి వస్తోంది. ఒకే గనిలో వందల సంఖ్యలో కార్మికులు పని చేస్తారు. బ్లాస్టింగ్​చేసే టైమ్​నుంచి బొగ్గును పైకి తరలించేవరకు ఒకేచోట ఎక్కువమంది కలిసి ఉంటుంటారు. గనిలోకి దిగే టైమ్​లో మ్యాన్​రైడింగ్ లో వెళ్లాల్సి ఉంటుంది. అందులో ఒకేసారి 50 మందికి తక్కువ కాకుండా కూర్చుని ప్రయాణిస్తుంటారు. దీంతో కరోనా కేసులు పెరిగే అవకాశం మెండుగా ఉంది. 

150 బెడ్స్ తో కరోనా ​సెంటర్​

మందమర్రి రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 1986 నుంచి మందమర్రి, శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు, రిటైర్మెంట్​కార్మిక కుటుంబాలకు సేవలు అందిస్తున్నారు.  దీంతోపాటు ఎమర్జెన్సీ టైమ్​లో బెల్లంపల్లి ఏరియా సింగరేణియులకు కూడా ఇక్కడే ట్రీట్​మెంట్​చేస్తున్నారు. సాధారణ సమయాల్లో ప్రతి రోజు సుమారు 1,200 మంది అవుట్​పేషెంట్లు ట్రీట్​మెంట్​ పొందుతారు.  140 బెడ్స్​ఉన్న ఈ ఆసుప్రతిలో సుమారు 30 డాక్టర్లు, 200 మంది పైగా పారామెడికల్​ఉద్యోగులు పని చేస్తున్నారు. దీనికి అనుబంధంగా మందమర్రిలో కేకే డిస్పెన్సరీ, బి జోన్​ డిస్పెన్సరీ, శ్రీరాంపూర్​ ఏరియాలోని ఆర్కే 8 డిస్పెన్సరీ పని చేస్తున్నాయి. గత ఏడాది కరోనా నేపథ్యంలో ఆర్కేపీ ఏరియా ఆసుపత్రిలో  సింగరేణీయుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్, క్వారంటైన్​సెంటర్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు. సుమారు 70 బెడ్స్​ను కరోనా బాధితుల కోసం అందుబాటులో ఉంచారు. కరోనా టెస్టులతో పాటు గతనెల 23 నుంచి కోవిడ్​ వ్యాక్సినేషన్​ కూడా చేస్తున్నారు. కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్​ కోసం ప్రత్యేక రూమ్స్​ కేటాయించారు. ఇప్పటికే రెండు వార్డులను కరోనా బాధితుల కోసం కేటాయించారు. రామకృష్ణాపూర్​ పట్టణంలోని ఆర్కేసీఈఓ క్లబ్​లో క్వారంటైన్​ సెంటర్ నడుపుతున్నారు. సింగరేణి డీవైసీఎంవో ఆధ్వర్యంలో నలుగురు సింగరేణి డాక్టర్లు, మరో నలుగురు కాంట్రాక్ట్​ డాక్టర్లు కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు. మిగిలిన డాక్టర్లు సాధారణ రోగులకు వైద్యం అందిస్తున్నారు. కరోనా రెండో దశలో విజృంభిస్తున్న నేపథ్యంలో 30 రోజుల్లో కార్మికులందరికి వ్యాక్సిన్​ వేయడం, స్పెషల్​కోవిడ్ వార్డుల ఏర్పాటు, క్వారంటైన్ సెంటర్ల లో బెడ్స్​ పెంపు, కోవిడ్​ర్యాపిడ్​టెస్టుల పెంపులో భాగంగా రామకృష్ణాపూర్​లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తిస్థాయి కోవిడ్​సెంటర్(ఆసుపత్రి)గా మార్చేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగా శనివారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్​ ఆధ్వర్యంలో కోవిడ్​సెంటర్​ కోసం డీవైసీఎంవో, డాక్టర్లు, ఆఫీసర్లతో సమీక్ష జరిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని వార్డుల్లో సుమారు 70 బెడ్స్​ ఉన్నాయి. వీటి సంఖ్యను 150కు పెంచనున్నారు. ఆసుపత్రితో పాటు ఆర్కేసీఈఓ క్లబ్​ క్వారంటైన్​సెంటర్​లో బెడ్స్​ సంఖ్య పెంచనున్నారు.  ఇప్పటికే సాధారణ క్యాజువాలిటీని కోవిడ్​ క్యాజువాలిటీగా మార్చారు.