కార్పొరేట్ ​దవాఖాన్లలో సింగరేణి కార్డు చెల్లట్లే

కార్పొరేట్ ​దవాఖాన్లలో సింగరేణి కార్డు చెల్లట్లే
  •     రూ. 40 వేలు కట్టించుకుని సీపీఆర్ఎంఎస్ ​కార్డులిచ్చిన యాజమాన్యం
  •     ప్యానల్​ హాస్పిటళ్లలో రిటైర్డ్​కార్మికులకు అందని ట్రీట్​మెంట్​

గోదావరిఖని, వెలుగు: సింగరేణి రిటైర్డ్​కార్మికులకు కంపెనీ ప్యానెల్ కార్పొరేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ అందుతలేదు. 2018లో కంపెనీ నుంచి ‘కాంట్రీబ్యూటరీ పోస్ట్ రిటైర్​మెంట్ మెడికేర్ స్కీమ్’( సీపీఆర్ఎంఎస్) కింద ఆరు జిల్లాల్లోని సుమారు 22 వేల మందికి హెల్త్​కార్డులు అందజేశారు. ఇందుకోసం ఒక్కో కార్మికుని నుంచి రూ. 40 వేలు వసూలు చేశారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్​లోని 68 హాస్పిటళ్లలో సీపీఆర్ఎంఎస్ కార్డు చూపిస్తే కార్మికుడు, ఆయన భార్యకు వారి లైఫ్​టైంలో రూ.8 లక్షల వరకు వైద్యసేవలు అందించాలని రూల్స్​ చెబుతున్నాయి. కానీ కంపెనీ అందించిన కార్డులు ఎక్కడా పనిచేస్తలేవని కార్మికులు ఆరోపిస్తున్నారు.  కోల్​మైన్స్​లో పనిచేసి రిటైర్​అయిన కార్మికులు, వారి భార్యలకు కార్పొరేట్ ట్రీట్​మెంట్ అందించేందుకు కోల్ ఇండియాలో ‘కాంట్రీబ్యూటరీ పోస్ట్ రిటైర్​మెంట్ మెడికేర్ స్కీమ్’ తీసుకొచ్చారు. 10వ వేజ్​బోర్డు కాలంలో రిటైర్ అయినవారు రూ.40 వేలు చెల్లిస్తే రూ.5 లక్షల వరకు కార్మికుడు, అతడి భార్యకు ట్రీట్​మెంట్​అందించేలా స్కీమ్​ను రూపొందించారు. 2018లో ఈ స్కీమ్ సింగరేణిలో అమలు చేశారు. అయితే 6వ వేజ్ బోర్డు కాలంలో రిటైర్​ అయిన కార్మికులను కూడా ఇక్కడ అనుమతించారు. రిటైరైన కార్మికుడు, ఆయన భార్య, డిపెండెంట్లకు లైఫ్​టైంలో రూ. 8 లక్షల వరకు వైద్య సేవలు అందించేలా నిర్ణయించారు. సీపీఆర్ఎంఎస్ కోసం ఆరు జిల్లాల వ్యాప్తంగా సుమారు 22 వేల మంది  అప్లై చేసుకున్నారు. వారందరికి స్కీమ్ను వర్తింపజేస్తూ కార్డులు అందజేశారు. సింగరేణి సంస్థ కరీంనగర్, వరంగల్, హైదరాబాద్​లో 68 హాస్పిటళ్ళను ప్యానెల్ లిస్ట్​లో చేర్చింది. ఈ హాస్పిటళ్లకు వెళ్లి సీపీఆర్ఎంఎస్ కార్డు చూపిస్తే రిటైర్ కార్మికులకు, వాళ్ల భార్యలకు భార్యకు ట్రీట్మెంట్​అందించాల్సి ఉంటుంది.

కార్డును అనుమతించని హాస్పిటల్స్​

సింగరేణి రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబసభ్యులకు జబ్బు చేస్తే హైదరాబాద్​లోని కంపెనీ ప్యానెల్లో ఉన్న హాస్పిటళ్లకు కార్డు తీసుకుని వెళితే కార్డు పనిచేయదని చెబుతున్నారు. దీంతో ఎంతోదూరం నుంచి అక్కడకు వెళ్లిన కార్మికులు, కుటుంబీకులు చేసేదేం లేక డబ్బులు కట్టి ఆ హాస్పిటల్​లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. జబ్బు నయమైన తర్వాత హాస్పిటల్ వారిచ్చే బిల్లులను తీసుకువచ్చి రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా చేసినా వారికి పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవిత కాలంలో రూ.8 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలున్నదని చెప్పిన యాజమాన్యం హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ కు ఎంత ఖర్చయిందో చెప్పకపోవడంతో రిటైర్డ్ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

పూర్తి డబ్బులు చెల్లించలేదు

సింగరేణి ఏరియా హాస్పిటల్​లో టైలర్గా పనిచేసి 2002లో రిటైరయ్యా. రూ.40 వేలు చెల్లించి సీపీఆర్ఎంఎస్ కార్డు తీసుకున్నా. నా భార్యకి థైరాయిడ్ క్యాన్సర్ రావడంతో హైదరాబాద్​లోని హాస్పిటల్​కు తీసుకెళ్లా. అక్కడ కార్డు ఇస్తే దానిని యాక్సెప్ట్ చేయలేదు. రూ.3.80 లక్షలు ఖర్చు చేసి ట్రీట్మెంట్​చేయించా. హాస్పిటల్ బిల్లులను రీయింబర్స్  చేయాలని సింగరేణి మేనేజ్​మెంట్​కి ఇస్తే రూ.1. 6 లక్షలు మాత్రమే చెల్లించారు. నిమ్స్ హాస్పిటల్ టారిఫ్ ప్రకారం బిల్లులు చెల్లిస్తామని అధికారులు అంటున్నారు. – —

‒ –ఎం.రామస్వామి, రిటైర్డ్ కార్మికుడు

కార్డు చెల్లదన్నారు

సింగరేణి రామగుండం ఏరియాలోని జీడీకే 10ఏ గనిలో మైనింగ్ సర్దార్​గా పనిచేసి 2011లో రిటైర్​అయ్యాను. రూ.40 వేలు చెల్లించి సీపీఆర్ఎంఎస్ కార్డు తీసుకున్నా. నరాల సమస్య ఉండడంతో ఇటీవల సింగరేణి హాస్పిటల్కు వెళితే అక్కడి నుంచి ప్యానెల్ లిస్ట్లో ఉన్న సికింద్రాబాద్​లోని హాస్పిటల్​కు వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లి బిల్లింగ్ సెక్షన్లో సీపీఆర్ఎంఎస్ కార్డు చూపిస్తే పనిచేయదని చెప్పారు. చేసేదేం లేక సొంతంగా డబ్బులు చెల్లించి ట్రీట్మెంట్​తీసుకున్నా.

‒ పారెపల్లి నర్సయ్య, రిటైర్డ్ కార్మికుడు