సింగరేణిలో కొత్త గనుల సంవత్సరంగా 2026

సింగరేణిలో కొత్త గనుల సంవత్సరంగా 2026

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో 2026ను కొత్త గనుల సంవత్సరంగా పేర్కొంటూ ఆ దిశగా కొత్త మైన్స్​ను ప్రారంభించుకోనున్నామని సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్ (ప్రాజెక్టు, ప్లానింగ్)​ కొప్పుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​లో మంగళవారం జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం హెడ్డాఫీస్ నుంచి బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వరకు డైరెక్టర్​(ఈఅండ్ఎం) తిరుమల రావుతో కలిసి టార్చ్ రన్​ను నిర్వహించి అమరులకు నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టిగా కృషి చేయడంతో పాటు పని గంటలను పూర్తిగా వినియోగించుకుంటేనే  ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయగలుగుతామన్నారు. 2047 నాటికి 25గిగావాట్ల పునరుత్పాదక శక్తి ఉత్పత్తి లక్ష్యాన్ని సింగరేణి నిర్దేశించుకుందన్నారు. ఒడిశాలోని నైనీ ప్రాజెక్టు నుంచి త్వరలో బొగ్గు ఉత్పత్తి స్టార్ట్​ అవుతొందన్నారు. కొత్తగూడెంలోని వీకే ఓసీతో పాటు ఇల్లెందు, మణుగూరు, శ్రీరాంపూర్​ ఏరియాల్లో కొత్త మైన్స్​లలో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్లాన్​ చేస్తున్నామన్నారు.