
- గుర్తింపు సంఘం ఎన్నికలపై కీలక నిర్ణయం
- రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో కార్మిక సంఘాల చర్చలు
- కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు హక్కు ఇవ్వలేమన్న సీఎల్సీ
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్2న ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌కు కేంద్ర కార్మికశాఖ డిప్యూటీ చీఫ్ రీజనల్ లేబర్‌కమిషనర్, సింగరేణి ఎన్నికల రిటర్నింగ్ఆఫీసర్శ్రీనివాసులు ఒకే చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్ఎల్సీ ఆఫీస్‌లో రిటర్నింగ్ఆఫీసర్సమక్షంలో కార్మిక సంఘాలు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై చర్చించాయి. మొదట రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎల్సీ సూచన మేరకు ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. వివిధ అంశాలపై కార్మిక సంఘాల అభిప్రాయాలను స్వీకరించారు. ఎన్నికలకు ఈవీఎంను వినియోగించే విషయాన్ని డిప్యూటీ సీఎల్సీ ప్రస్తావించగా అన్ని కార్మిక సంఘాలు రహ్యస బ్యాలెట్పద్ధతిలోనే ఎన్నికలు జరిపించాలని కోరాయి. గుర్తింపు సంఘం కాలపరిమితిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రధాన కార్మిక సంఘాలు 4 ఏళ్ల కాలపరిమితికి పట్టుబట్టగా, మిగిలిన సంఘాలు రెండేళ్లు మాత్రమే ఉండాలన్నాయి. దీనిపై సీఎల్సీ నిర్ణయం తీసుకుంటుందని రిటర్నింగ్ఆఫీసర్స్పష్టం చేశారు. షెడ్యూల్ రిలీజ్ టైమ్‌లో కాలపరిమితిపై స్పష్టత ఇవ్వాలని కార్మిక సంఘాల ప్రతినిధులు సూచించారు. సింగరేణిలో ఓట్ల విధానంపై చర్చించారు. డివిజన్‌స్థాయిలో ఎన్నుకోవడానికి ఒక ఓటు, కార్పొరేట్ స్థాయిలో గుర్తింపు కోసం మరో ఓటు ఉండాలని ఆయా యూనియన్లు అభిప్రాయపడ్డాయి. మెజార్టీ సంఘాలు ఒకే ఓటు విధానానికి మొగ్గు చూపించాయి. పర్మినెంటు కార్మికుల మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలన్న కొన్ని సంఘాల డిమాండ్‌పై రిటర్నింగ్ఆఫీసర్ సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
బొగ్గు డిమాండ్ నేపథ్యంలో మే తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యం అభిప్రాయపడగా కార్మికసంఘాలు వ్యతిరేకించాయి. ఇప్పటికే వివిధ కారణాలను చూపుతూ సింగరేణి నాలుగేళ్లు కాలయాపన చేసిందని సంఘాలు మండిపడ్డాయి. ఆలస్యం చేస్తే మళ్లీ కోర్టుకు వెళ్తామంటూ ఏఐటీయూసీతో పాటు కొన్ని సంఘాలు హెచ్చరించాయి. దీంతో డిప్యూటీ సీఎల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలతో సీఎల్సీ తనను ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ఆఫీసర్గా నియమించిందని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు. ఏప్రిల్ 2న జరిగే మీటింగ్‌లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. షెడ్యూల్‌ను రూపొందించడానికి సింగరేణి భవన్ లేదా హైదరాబాద్‌లోని ఏదైనా ఇతర ప్రదేశంలో మీటింగ్నిర్వహిస్తామని, ఆ వివరాలను తర్వాత తెలియజేస్తామని చెప్పారు. కార్మిక సంఘాలు వ్యక్తంచేసిన అభిప్రాయాలను సీఎల్సీకి నివేదిస్తామన్నారు. ఈ చర్చలకు 33 కార్మిక సంఘాలకు ఆహ్వానాలు పంపగా 15 యూనియన్ల ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. ఏప్రిల్ 2న షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఏప్రిల్ చివరిలో కాని మే మొదటివారంలో ఎన్నికలు జరిగే వీలున్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.