
- గతేడాది రూ.2,412 కోట్ల నికర లాభాల్లో.. 33 శాతం కింద రూ.796 కోట్లు చెల్లింపు
- ఈ సారి రూ.2,360 కోట్ల లాభాల్లో.. కార్మికుల వాటాగా రూ.819 కోట్లు
- నికర లాభాలు తగ్గినా.. ఒక శాతం పెరిగిన కార్మికుల వాటా
- గడిచిన 26 ఏండ్లలో 10 శాతం నుంచి 34 శాతానికి పెరుగుదల
- తాజాగా పర్మినెంట్ కార్మికులకు సగటున రూ.1,95,610 బోనస్
- కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 చెల్లింపునకు సర్కారు నిర్ణయం
కోల్‌బెల్ట్/గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికులు సుమారు ఆరు నెలలుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న లాభాల వాటా ప్రకటన ఎట్టకేలకు సోమవారం వచ్చింది. సింగరేణి సంస్థ 2024–-25 ఆర్థిక సంవత్సరం గడించిన రూ.2,360 కోట్ల నికర లాభాల్లో 34 శాతం వాటా రూపంలో రూ.802 కోట్లు పర్మినెంట్ కార్మికులకు చెల్లించనున్నారు. అలాగే, కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున రూ.17 కోట్లను సంస్థ నుంచి చెల్లించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ప్రకటించారు.
లాభాలు తగ్గినా.. పెరిగిన కార్మికుల వాటా
గతేడాది కన్నా నికర లాభాలు తగ్గినా.. కార్మికుల వాటా ఒక శాతం పెరిగింది. 2023–-24 ఆర్థిక సంవత్సరం రూ.2,412 కోట్ల నికర లాభాల్లో 33 శాతం రూ.796 కోట్లు కార్మికులకు వాటాగా ప్రభుత్వం పంపిణీ చేసింది. 2024-–25 సంవత్సరంలో సంస్థకు రూ.6,394 కోట్ల లాభాలు రాగా వాటిలో రూ.4,034 కోట్లు సింగరేణి విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలకు తీసివేయగా మిగిలిన రూ.2,360 కోట్లు నికర లాభంగా ప్రభుత్వం ప్రకటించింది.
గతేడాది కన్నా పర్మినెంట్ కార్మికుల వాటాను ఒక శాతం పెంచుతూ 34 శాతం వాటాగా రూ.802 కోట్లు పంపిణీ చేయనుంది. అలాగే, కాంట్రాక్ట్కార్మికులకు రూ.5,500 చొప్పున సంస్థ నుంచి రూ.17 కోట్లు పంపిణీ చేయనుంది. మొత్తంగా కార్మికులకు రూ.819 కోట్లు అందజేయనుంది. నికర లాభాలు తగ్గినప్పటికీ ఒక శాతం వాటా పెంపుదలతో గతేడాది కన్నా ఎక్కువ మొత్తంలో పర్మినెంటు కార్మికులు లాభాల వాటాను అందుకోనున్నారు.
కార్మికులు సగటున రూ.1,95,610 లక్షల చొప్పున పొందనున్నారు. పెరిగిన లాభాల వాటా నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే 10 శాతం వాటాతో 1999–-2000 సంవత్సరంలో మొదలై గడిచిన 26 ఏండ్లలో అది 34 శాతానికి పెరుగుతూ వచ్చింది. ఈ యేడాది ప్రకటించిన 34 శాతం ఇదే అత్యధిక వాటా. త్వరలోనే ఈ వాటా డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కాగా, దసరా, దీపావళి పండగలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో లాభాల వాటా చెల్లింపు ప్రకటనపై కార్మికవర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది.
లాభాల వాటా చెల్లింపు దేశంలోనే ప్రత్యేకత..
దేశంలోనే ఎక్కడా లేని విధంగా సింగరేణి కాలరీస్ కంపెనీలో కార్మికులు సంస్థకు వచ్చిన లాభాల్లో వాటా పొందుతున్నారు. గతేడాది నుంచి కాంట్రాక్ట్ కార్మికులు కూడా బోనస్ రూపంలో కొంత మొత్తం అందుకుంటున్నారు. 1999-–2000 ఆర్థిక సంవత్సరం నుంచి సింగరేణి సంస్థ సాధించిన బొగ్గు ఉత్పత్తి, వాటి అమ్మకాల టర్నోవర్‌పై ఏటా ఆర్జించిన లాభాల్లో వాటాను కార్మికులకు చెల్లిస్తోంది.
నష్టాల బాటలో ఉన్న సింగరేణికి లాభాలు తీసుకువస్తే కార్మికులకు లాభాల్లో వాటా చెల్లిస్తామని అప్పటి సీఎం చంద్రబాబు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నేతలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనను ఒప్పించి లాభాల వాటా ప్రక్రియను మొదలుపెట్టారు.
మొదట 10 శాతం వాటాతో మొదలై కొన్నేండ్లు అంతే కొనసాగుతూ వచ్చింది. తర్వాత సీఎంగా వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దాన్ని ఏకంగా 16 శాతానికి పెంచారు. దానికి తగ్గట్టుగా ఈ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఒక్కో శాతం పెంచుకుంటూ రావడంతో నేడు అది 34 శాతానికి చేరింది.