- గ్రీన్ ఎనర్జీలో భాగంగా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు
- ఇప్పటికే కార్పొరేట్ ఆఫీస్‌పై ఉత్పత్తి ప్రారంభం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కార్పొరేట్ఆఫీస్ను గ్రీన్ ఎనర్జీ దిశగా తీర్చిదిద్దేందుకు మేనేజ్‌మెంట్ కసరత్తు చేస్తోంది. ‘కరెంట్‌ను ఉత్పత్తి చేద్దాం.. మనమే వినియోగించుకుందాం.. బిల్లులు తగ్గించుకుందాం’ అనే నినాదంతో 5 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మేనేజ్‌మెంట్ శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఏడాదికి సుమారు రూ.4కోట్లకు పైగా కరెంట్ బిల్లు ఆదా కానుంది. దీనిలో భాగంగా కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్‌తోపాటు పలు ఆఫీసులు, కాలనీలో 5 మెగావాట్ల కరెంట్ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఈనెల 14న కార్పొరేట్ ఆఫీస్‌లో ఉత్పత్తి స్టార్ట్ కాగా.. పలు దశల్లో వివిధ ఆఫీసుల్లో పవర్‌ను ఉత్పత్తి చేయనున్నారు.
గ్రీన్ ఎనర్జీలో భాగంగా రూఫ్ టాప్ సోలార్
ప్రతి ఏడాది సింగరేణి వ్యాప్తంగా మైన్లతో పాటు ఆఫీసులు, కాలనీల్లో కరెంటు వినియోగానికి సంబంధించి ప్రతి ఏడాది సింగరేణి ప్రభుత్వానికి రూ.కోట్లలో బిల్లులు చెల్లిస్తోంది. ఈ క్రమంలో కరెంటు బిల్లులను తగ్గించుకోవడంతోపాటు గ్రీన్ ఎనర్జీపై సింగరేణి ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో మొదటి దశలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్‌తో పాటు సింగరేణి మెయిన్ హాస్పిటల్, ఏపీ సెంటర్, సింగరేణి ఉమెన్స్ కాలేజీ, నర్సింగ్కాలేజీ బిల్డింగ్‌లపై 1.23 మెగావాట్లతో రూఫ్టాప్సోలార్ప్లాంట్ను ఏర్పాటు చేసింది.
తాజాగా కొత్తగూడెం ఏరియాలోని కొత్తగా నిర్మించిన జీఎం ఆఫీస్, బంగ్లోస్ ఏరియా, న్యూ ఎంసీ క్వార్టర్స్, సత్తుపల్లి ఏరియాలోని జీఎం ఆఫీస్‌తోపాటు కాలనీలు, గోలేటీ ప్రాంతంలోని జీఎం ఆఫీస్, డిస్పెన్సరీ, గోలేటీ టౌన్షిప్, భూపాలపల్లి ఏరియాలోని కాలనీల్లో 5 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తికి సింగరేణి రెడీ అయింది. ఇప్పటికే కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ మీద ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభం కాగా.. ఇతర ఆఫీసులు, కాలనీలోనూ త్వరలో కరెంట్ ఉత్పత్తిని స్టార్ట్ చేయనున్నారు.
కరెంట్ బిల్లుల ఆదా
సింగరేణి హెడ్డాఫీస్, ఇతర ఆఫీసుల బిల్డింగ్‌లపై ఏర్పాటు చేయనున్న 5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేయనున్నారు. 5 మెగావాట్ల కరెంట్‌కు సింగరేణి మేనేజ్‌మెంట్ ఏటా దాదాపు రూ. 4కోట్లకు పైగా బిల్లుల రూపంలో ఆ శాఖకు చెల్లిస్తోంది. ఈ మేరకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటైతే ఈ డబ్బు ఆదా కానుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రూఫ్టాప్సోలార్ ప్లాంట్లను సింగరేణి వ్యాప్తంగా ఏర్పాటు చేసి కరెంట్ బిల్లులను జీరో చేయడంతో పాటు అవసరమైతే.. కరెంట్ డిపార్ట్‌మెంట్‌కే విద్యుత్‌ను అమ్మే లక్ష్యంగా సింగరేణి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. తద్వారా సంస్థ ఆర్థికంగా పరిపుష్ఠం కానుంది. దీనిలో భాగంగానే రూఫ్ టాప్సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి రెడీ అవుతోందని అధికారులు చెబుతున్నారు.
