
- కారుణ్య నియామకాల వయోపరిమితి పెంపు
- అప్పర్ ఏజ్ లిమిట్ 40 ఏండ్లకు హైక్
- వందలాది కుటుంబాలకు ప్రయోజనం
హైదరాబాద్: సింగరేణి కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో ఏళ్లుంగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అకాల మరణం చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి, అనారోగ్యంతో (మెడికల్ అన్‌ఫిట్) ఉద్యోగ విరమణ చేసిన వారి పిల్లలను బదిలీ కార్మికునిగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలోకి తీసుకుంటారు. గతంలో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారినే కారుణ్య నియామకాల కింద తీసుకునే వారు.
కరోనా కాలంలో రెండేళ్ల పాటు వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంతో సింగరేణి కార్మికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కారుణ్య నియామకాల వయో పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కారుణ్య నియామకాల వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. వయో పరిమితి సడలిస్తూ ఇచ్చిన ఉత్తర్వును 2018, మార్చి 9వ తేదీ నుంచి అమలు చేస్తారు. ప్రస్తుత ఉత్తర్వుతో సింగరేణిలో వందలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.