
మందమర్రి, వెలుగు: సింగరేణి బొగ్గు గనులు, ఓసీపీలతో ప్రభావిత గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని, బొగ్గు గని కోసం చేపట్టిన పబ్లిక్ హియరింగ్‌పై స్థానికులకు సమాచారం ఇవ్వకుండా సంస్థ కార్మికులు, అనుకూల కార్మిక సంఘాల లీడర్లతో నిర్వహిస్తున్నారంటూ టీఆర్ఎస్పార్టీ మండల ప్రజాప్రతినిధులు, బొగ్గు గనుల ప్రభావిత గ్రామస్థులు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కాసీపేట మండలం చిన్నధర్మారం వద్ద గల కాసీపేట 1 సింగరేణి బొగ్గు గని వద్ద మంగళవారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల నిరసనలతో కార్యక్రమం రసాభాసగా మారింది. కాసీపేట1 గనిలో ప్రస్తుతం ఏటా 0.18 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. న్యూటన్నెల్ సెమీ మెకనైజేషన్ ద్వారా 0.54 మిలియన్ టన్నుల ఉత్పత్తి పెంపుదల, గని ప్రాంతాన్ని 254 హెక్టార్ల నుంచి 315.54 హెక్టార్ల పెంపుదల కోసం మంగళవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(నిజామాబాద్) రీజియన్ఇన్చార్జి లక్ష్మణ్ప్రసాద్ నేతృత్వంలో పబ్లిక్ హియరింగ్ చేపట్టారు.
ఎవరికీ సమాచారం ఇవ్వలేదంటూ..
పబ్లిక్ హియరింగ్విషయమై ప్రభావిత గ్రామాల ప్రజలకు సింగరేణి యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కాసీపేట మండల ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మందమర్రి ఏరియాలో చేపట్టిన అభివృద్ధి పనులు, కాసీపేట గని గురించి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతుండగా కాసీపేట వైస్‌ఎంపీపీ విక్రమ్‌రావు, జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య, సర్పంచులు అరె బాదు, బుక్య సునీత, ధరావత్ దేవి, లౌడియ సంపత్, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాదవత్నీలా, గ్రామస్థులు అభ్యంతరం చెప్పారు. కాసీపేట 1 అండర్‌గ్రౌండ్ మైన్ఉత్పత్తి పెంపుదలకు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ కాసీపేట, కేకే ఓసీపీ వల్ల ప్రభావిత గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి పనులంటూ జీఎం అబద్ధాలు చెబుతున్నారన్నారు. ముందుగా తమ అభిప్రాయాలు చెప్పి వెళ్లిపోతామంటూ ప్రజాప్రతినిధులు పట్టుబట్టడంతో మంచిర్యాల జిల్లా అడిషనల్కలెక్టర్ మధుసూదన్‌నాయక్, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్‌రావు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రీజియన్ఇన్చార్జి లక్ష్మణ్ప్రసాద్ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. వైస్‌ఎంపీపీ విక్రమ్‌రావు మాట్లాడుతూ 27 ఏళ్ల కిందట మండలంలో బొగ్గు గనులను ఏర్పాటు చేశారని, ఇప్పటివరకు ప్రభావిత గ్రామాల్లో తాగడానికి నీళ్లు, రోడ్లు, కనీస వసతులను సింగరేణి యాజమాన్యం కల్పించలేదని మండిపడ్డారు. సింగరేణి తీరును నిరసిస్తూ పబ్లిక్ హియరింగ్‌ను బాయ్కాట్చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కాసీపేట-– చిన్నధర్మారం రోడ్డుపై ధర్నాకు దిగడంతో పోలీసులు వారందరని దేవాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పబ్లిక్ హియరింగ్‌లో ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయాలను ప్రభుత్వానికి విన్నవిస్తానని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ చెప్పారు.