
అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. నిందితులకు రిమాండ్ విధించాలన్న ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. 2025, మే 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితులకు జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని పోలీసులు విజయవాడ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన సిట్ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటింది. ఈ కేసులో అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను సిట్ నిందితులుగా చేర్చింది.
►ALSO READ | మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఫ్రీ బస్ స్కీమ్‌పై CM చంద్రబాబు కీలక ప్రకటన
కేసు విచారణలో భాగంగా మూడు రోజుల పాటు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని ప్రశ్నించిన సిట్ బృందం.. 2025, మే 16 రాత్రి ఈ ఇద్దరిని అరెస్ట్ చేసింది. శనివారం (మే 17) నిందితుల్ని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా.. 20వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్పను ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందనే దానిపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగనే లక్ష్యంగా సిట్ పావులు కదుపుతున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరగుతోంది. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆయన ఆరోపించారు. దీంతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరగనుందో చూడాలి.