
అమరావతి: ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్‌పై ఆయన కీలక ప్రకటన చేశారు. శనివారం (మే 17) సీఎం చంద్రబాబు కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025, ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సహయం అందించే స్కీములపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ స్కీమ్ వర్తిస్తోందని ప్రకటించారు. పంట పెట్టుబడి సాయం కింద ఏటా రూ.14 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తామని తెలిపారు. రైతు కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా మరో రూ.8 వేలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందని పేర్కొన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఓర్వకల్‌కి రైల్వే ట్రాక్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
►ALSO READ | మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వివేక్
కాగా, 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలిస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోవడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫ్రీ బస్ స్కీమ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2025, ఆగస్ట్ 15 నుంచి ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.