
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా. ధరణితో సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు .సామాన్యుడికి అన్యాయం జరిగితే ఏ అధికారికి చెప్పుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ధరణి చట్టంతో సామాన్యుడికి న్యాయం చేసే అధికారం అధికారులకు కూడా లేకుండా పోయిందన్నారు. ధరణి ద్వారా భూదందా ఏ స్థాయిలో జరిగిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. సీఎం రేవంత్ పట్టుదలతో రైతాంగాన్ని కాపాడేందుకు ఈ భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చామన్నారు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ పై రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దామోదర పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన దామోదర రాజనర్సింహా.. నిజాం కాలంలో దున్నే వాడిదే భూమి అని భూ హక్కుల కోసం రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. రాష్ట్రంలో 25వేల ఎకరాలకు భూమిని నిరుపేదలకు పంపిణీ చేసిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డికి దక్కింది. 2008 లో వైఎస్ హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా పేదలకు భూములు పంచింది. బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరమైనా పేదలకు వచ్చిందా.? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు అత్యంత పకడ్బందీగా భూ భారతి చట్టానికి రూపకల్పన చేశారని దామోదర రాజనర్సింహా అన్నారు.
►ALSO READ | 2200 మంది అనాధ చిన్నారులకు హెల్త్ కార్డులు
6000 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తొలి విడతలో వెయ్యిమంది సర్వేయర్లను నియామకం కోసం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. ధరణిలో రైతులు తమ భూ సమస్య పరిష్కారం కోసం భార్య మెడలో తాళిని తాకట్టు పెట్టేవారన్నారు. నాలుగు గోడల మధ్యలో నలుగురు వ్యక్తులు తమ స్వార్థం కోసం తీసుకువచ్చిన ఈ చట్టంతో వేలాదిమంది రైతులు ఎంతో ఘోష పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల భూములను ఆగం చేసిన బీఆర్ఎస్ సర్కారును ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు గద్దె దించారన్నారు.