
- ఓసీపీ ల్లో 37,048,54 టన్నుల ఉత్పత్తికి, 32,993,78 టన్నులే తవ్వకం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భారీ వానలతో సింగరేణిని బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. ఈనెలలో వర్షాలు ఎక్కువగా కురిశాయి. దీంతో దాదాపు రూ. 120కోట్లకు పైగా బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌పడింది. ఈ ఎఫెక్ట్ వార్షిక ఉత్పత్తి లక్ష్యాలపైనా పడనుంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తిలో కీలకమైన ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో కోల్ప్రొడక్షన్కు తరుచూ విఘాతం కలుగుతోంది. ఓ వైపు అండర్‌గ్రౌండ్ మైన్స్‌లో బొగ్గు ఉత్పత్తి నామమాత్రంగా జరుగుతోంది. సింగరేణి వ్యాప్తంగా బుధవారం ఓపెన్‌కాస్టు మైన్లలో 1,67,715 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా వర్షాలతో కేవలం 81,611 టన్నులను మాత్రమే తవ్వారు. 86,104 టన్నుల కోల్ప్రొడక్షన్పై వాన దెబ్బ పడింది. ఈ నెలలో ఇప్పటి వరకు ఓపెన్‌కాస్టు మైన్స్‌లలో 37,048,54 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 32,993,78 టన్నులు తవ్వారు.
సింగరేణివ్యాప్తంగా ఈ నెలలో వర్షాలు అధికంగా పడ్డాయి. దీంతో దాదాపు రూ. 120కోట్లకుపైగా విలువైన 4,05,476 టన్నుల బొగ్గు ఉత్పత్తి కాలేదు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో వరద నీరు నిల్వడంతో పాటు డంపర్లు, టిప్పర్లు తిరగడానికి తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఇదిలా ఉండగా కోల్టార్గెట్లను అండర్‌గ్రౌండ్ మైన్లు చేరుకోలేకపోతున్నాయి.
ఈ నెలలో ఇప్పటివరకు 5,45,776 టన్నులకు టార్గెట్‌కు 2,86,751టన్నులు మాత్రమే తవ్వారు. వర్షాలతో ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుండగా.. కనీసం అండర్ గ్రౌండ్ మైన్లలో ప్రొడక్షన్ పెరిగితే టార్గెట్చేరుకోవడం ఈజీ అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.