ఒడిశాలోని బొగ్గు గని కోసం సింగరేణి పోటీ

ఒడిశాలోని బొగ్గు గని కోసం సింగరేణి పోటీ

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఓవైపు రాష్ట్రంలోని బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తున్న సింగరేణి.. మరోవైపు ఒడిశాలోని బంఖుయ్​కోల్​బ్లాక్​ను దక్కించుకునేందుకు మంగళవారం కోల్​మినిస్ట్రీ నిర్వహించిన వేలంలో పాల్గొంది. సింగరేణి సహా తమిళనాడులోని జెన్కో, ఒడిశాలోని ఎజ్గాని పవర్​ప్లాంట్ సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. బంఖుయ్ బ్లాక్​లో దాదాపు 800 మిలియన్​ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఏడాదికి దాదాపు 10 మిలియన్​ టన్నులు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఒడిశాలోని నైని కోల్​బ్లాక్​ను సొంతం చేసుకున్న సింగరేణి.. దాని పక్కనే ఉన్న బంఖుయ్ బ్లాక్​ను ఎలాగైనా దక్కించుకోవాలని ప్లాన్ చేసింది. అయితే టెండర్లలో పాల్గొన్న ఎజ్గాని పవర్​ప్లాంట్​ దాదాపు 11.25 శాతం ఎక్కువకు కోట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ బ్లాక్ సింగరేణి చేజారుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, పోయిన డిసెంబర్ లో మంచిర్యాలలోని కల్యాణిఖని బ్లాక్‌‌‌‌–6, శ్రావణపల్లి, భద్రాద్రిలోని కోయగూడెం బ్లాక్‌‌‌‌–3, ఖమ్మంలోని సత్తుపల్లి బ్లాక్‌‌‌‌–3 గనులను కోల్ మినిస్ట్రీ వేలం వేయగా.. సింగరేణి సంస్థ పాల్గొననేలేదు. కోయగూడెం, శ్రావణపల్లి బ్లాక్ లకు సింగిల్ బిడ్స్ రావడంతో ఆఫీసర్లు జనవరిలో మరోసారి టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకురాలేదు. ఇలా సొంత రాష్ట్రంలోని నాలుగు బ్లాక్​లను పట్టించుకోని సింగరేణి.. ఒడిశాలోని గని కోసం పోటీపడడం గమనార్హం.

For more news..

గుట్టుగా స్పౌజ్ బదిలీలు

ముంపు గ్రామాల పిలగాండ్లకు పిల్లనిస్తలె