కొత్త గనుల వేలానికి సింగరేణి సై ! త్వరలో దేశ వ్యాప్తంగా 181 బొగ్గు బ్లాక్‌‌ల వేలం

కొత్త గనుల వేలానికి సింగరేణి సై ! త్వరలో దేశ వ్యాప్తంగా 181 బొగ్గు బ్లాక్‌‌ల వేలం
  • కొత్త బ్లాక్‌‌లు దక్కాలంటే వేలంలో పాల్గొనడం తప్పనిసరి చేసిన కేంద్రం
  • గత సర్కార్‌‌ పర్మిషన్‌‌ ఇవ్వకపోవడంతో వేలానికి దూరంగా సింగరేణి
  • మరో ఐదేండ్లలో పది గనులు మూత పడే చాన్స్‌‌
  • వేలంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సంస్థ

కోల్‌‌బెల్ట్‌‌, వెలుగు: మరో ఐదేండ్లలో పది గనులు మూతపడనుండడం .. కేంద్ర చట్టం ప్రకారం వేలంలో కొత్త గనులు దక్కించుకోకపోవడంతో సింగరేణి భవిష్యత్‌‌ ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలన్నా, బొగ్గు ఉత్పత్తి సాఫీగా సాగాలన్నా కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొనడం సింగరేణికి అనివార్యంగా మారింది. త్వరలో 181 బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ వేలంలో పాల్గొనేందుకు సింగరేణి సన్నద్ధం అవుతోంది.

కొత్త చట్టంతో ఇబ్బందులు
దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాక్‌‌ల కేటాయింపునకు కేంద్రం కొత్తగా వేలం విధానాన్ని ప్రవేశపెట్టడంతో సింగరేణికి కష్టాలు మొదలయ్యాయి. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం ప్రకారం భూగర్భ గనులపై పూర్తి అధికారాలు 2021 నుంచి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్లాయి. సింగరేణిలో కేంద్రం వాటా కూడా ఉన్నందున 2014కు ముందు బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి ప్రాంత బ్లాక్‌‌లను మినహాయించేవారు. కానీ 2021లో చట్టానికి సవరణలు చేసిన కేంద్రం ‘ది మైన్స్‌‌ అండ్‌‌ మినరల్స్‌‌ డెవలప్​మెంట్‌‌ అండ్‌‌ రెగ్యులరైజేషన్‌‌ బిల్లు-2021’ పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. 

ఈ బిల్లుకు అప్పటి బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ సైతం మద్దతు పలికింది. ఈ బిల్లు ప్రకారం ఏ కంపెనీకైనా బొగ్గు బ్లాక్‌‌లను వేలం ద్వారానే కేటాయించాలి. నేరుగా కేటాయింపు పొందితే 14 శాతం రాయల్టీ చెల్లించాలి. సవరణ బిల్లు ప్రకారం 2022 నుంచి ఇప్పటివరకు రెండు విడతలుగా సింగరేణి గనులను వేలంలో చేరుస్తూ వచ్చారు. ప్రభుత్వ సంస్థలకు బొగ్గు గనులను నేరుగా కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం అందుకు భిన్నంగా సింగరేణి గనులను సైతం వేలంలో చేర్చింది.

అప్పటి బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ బొగ్గు బ్లాక్‌‌ల వేలంలో పాల్గొనేందుకు సింగరేణికి పర్మిషన్‌‌ ఇవ్వలేదు. సింగరేణి ప్రాంతానికి చెందిన కోయగూడెం, సత్తుపల్లి, మందమర్రి కేకే6 , మణుగూరు ఓసీపీ3 బ్లాక్‌‌లను కేంద్రం వేలంలో పెట్టగా.. కోయగూడెం, సత్తుపల్లి గనులను ప్రైవేట్‌‌ కంపెనీలు దక్కించుకున్నాయి. కోయగూడెం బ్లాక్‌‌లో సుమారుగా 120 మిలియన్‌‌ టన్నులు, సత్తుపల్లి బ్లాక్‌‌లో 70 మిలియన్‌‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు న్నాయి. ఒక్కో టన్నును రూ.3,300 విక్రయించినా సింగరేణికి సుమారు రూ. 60 వేల కోట్లు వచ్చేవి. కానీ వేలంలో పాల్గొనేందుకు అప్పటి ప్రభుత్వం పర్మిషన్‌‌ ఇవ్వకపోవడంతో ఈ మేరకు లాభంతో పాటు ఐదు వేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లేకుండా పోయింది. ఈ గనులు దక్కించుకుంటే 23 ఏండ్ల పాటు ఇల్లందు ఏరియాకు ఎలాంటి ఢోకా ఉండేది కాదు.

సింగరేణి భవిష్యత్‌‌పై నీలి నీడలు
కోల్‌‌ ఇండియా సంస్థ 500 మిలియన్‌‌ టన్నుల నుంచి 880 మిలియన్‌‌ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సింగరేణి సంస్థ మాత్రం 60 మిలియన్‌‌ టన్నుల నుంచి అతికష్టంగా 70 మిలియన్‌‌ టన్నులు సాధించగలిగింది. 100 మిలియన్‌‌ టన్నుల టార్గెట్‌‌ సాధించాలని చెబుతున్నప్పటికీ.. పదేండ్లలో కొత్తగా ఒక్క గని కూడా తవ్వకపోవడంతో టార్గెట్‌‌ చేరుకోవడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మరో 25 ఏండ్ల వరకు మాత్రమే బొగ్గుకు డిమాండ్‌‌ ఉంటుందన్న నేపథ్యంలో కొత్త బ్లాక్‌‌లను సాధించి మార్కెట్‌‌లో నిలబడితేనే సింగరేణి మనుగడ సాధ్యం అవుతుంది.

వేలం ద్వారా బ్లాక్‌‌లను కేటాయిస్తుండడంతో సింగరేణి నుంచి బొగ్గును కొనుగోలు చేస్తున్న సంస్థలు సైతం ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టాయి. దీంతో సింగరేణికి వినియోగదారులు సైతం దూరమవుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న గనుల్లో బొగ్గు నిల్వలు అడుగంటిపోయాయి. మరో ఐదేండ్లలో పది గనులు మూతపడే పరిస్థితి ఉంది. గనుల మూసివేతతో సింగరేణిలో మందమర్రి, బెల్లంపల్లి, ఇల్లందు, మణుగూరు, రామగుండం1 వంటి ఏరియాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ గనులు మూతపడితే సుమారు 8 వేల మంది ఉద్యోగులను తొలగించడం తప్పనిసరి కానుంది. ఈ నేపథ్యంలో కొత్త బ్లాక్‌‌లను దక్కించుకోవడం సింగరేణికి అనివార్యంగా మారింది. 

వేలంలో పాల్గొనేందుకు సింగరేణి సన్నాహాలు
ఇప్పటికే రెండుసార్లు బొగ్గు బ్లాక్‌‌ల వేలంలో పాల్గొనకుండా నేరుగా గనుల కేటాయింపు కోసం ఎదురుచూసిన సింగరేణి తన పంథా మార్చుకుంది. కేంద్రం నిర్వహించే గనుల కేటాయింపుల వేలంలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. నామినేషన్‌‌పై నేరుగా గనులు కేటాయిస్తే.. కేంద్రానికి చెల్లించాల్సిన రాయల్టీ ఎక్కువగా ఉంటుంది. అదే వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్‌‌ను చేజిక్కించుకుంటే.. సింగరేణికి ఏటా కనీసం రూ.400 కోట్ల వరకు మిగులుతుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి ప్రస్తావించారు. సింగరేణి సంస్థ మనుగడ, ఉపాధుల పెరుగుదల, కోల్‌‌బెల్ట్‌‌ ప్రాంతాల అభివృద్ధి కోసం తప్పనిసరిగా వేలంలో పాల్గొని కొత్త బ్లాక్‌‌లను దక్కించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

వేలం పట్ల పలు కార్మిక సంఘాలు కూడా సానుకూలంగా స్పందించాయి. ఇటీవల మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి ఎంఎన్‌‌ఆర్‌‌ గార్డెన్స్‌‌లో నిర్వహించిన 55వ సింగరేణి వార్షిక రక్షణ పక్షోత్సవాలకు హాజరైన సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్​సైతం సింగరేణి సంస్థ.. వేలంలో పాల్గొని కొత్త బొగ్గు బ్లాక్‌‌లను దక్కించుకుంటుందని స్పష్టం చేశారు. త్వరలో 181 బొగ్గు బ్లాక్‌‌ల వేలానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇందులో కొన్ని సింగరేణి ప్రాంత బొగ్గు బ్లాక్‌‌లు సైతం ఉన్నాయి. దీంతో వేలంలో పాల్గొని కొత్త బ్లాక్‌‌లను దక్కించుకునేందుకు రాష్ట్ర సర్కార్, సింగరేణి ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.