బొగ్గు గనుల రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఎంపీ వంశీకృష్ణ

బొగ్గు గనుల రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఎంపీ వంశీకృష్ణ
  • ఎంపీకి థ్యాంక్స్ తెలిపిన ఉద్యోగులు

కోల్​బెల్ట్, వెలుగు :  బొగ్గు గనుల రిటైర్డు ఉద్యోగులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అండగా నిలిచారని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్​ ప్రెసిడెంట్​దండం రాజరాంచందర్ రావు, జనరల్​సెక్రటరీ ఆళవందార్ వేణుమాధవ్ తెలిపారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పై గురువారం పెద్దపల్లి ఎంపీ పార్లమెంట్​లో ప్రస్తావించడంతో ఆయనకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా అసోసియేషన్​సభ్యులు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకా వెంకటస్వామి బొగ్గు గనుల రిటైర్డ్​ ఉద్యోగులను ఆదుకోవడానికి పెన్షన్ స్కీమ్​ తీసుకొచ్చారని, 35 ఏండ్ల గడిచినా ఇప్పటికీ ఆప్​డేట్ కాలేదన్నారు. ఈ విషయాన్ని ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్​లో మరోసారి ప్రస్తావించడం అభినందనీయమన్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఉద్యోగుల పెన్షన్​ సమస్యను ఎంపీ లేవనెత్తారని గుర్తుచేశారు.

 గతంలో సీఎంపీఎఫ్​కి టన్ను బొగ్గుకు రూ.20 కేటాయించినప్పటికీ పెన్షన్​రివిజన్ అమలు కాలేదని, తమకు ఇప్పటికీ రూ.500 నుంచి 1000 మాత్రమే అందుతుందన్నారు. అనారోగ్యం బారిన పడిన రిటైర్డ్​ఉద్యోగులకు వస్తున్న అరకొర పెన్షన్​తో కనీసం మందులు కొనడానికి సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం రూ.10 వేల పెన్షన్​ ఇవ్వాలని ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్​లో ప్రస్తావించి తమకు అండగా నిలిచారని తెలిపారు. ఎంపీ చొరవతో రిటైర్డ్​ఉద్యోగులకు పెన్షన్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.