
‘డాట్’ కంపెనీపై వేటుకు రెడీ
సొంతగా వెహికల్స్ సమకూర్చుకుంటున్న మేనేజ్మెంట్
రామకృష్ణాపూర్, వెలుగు: మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిలో సింగరేణి యాజమాన్యం సొంతగా ఓవర్ బర్డెన్(మట్టి) వెలికితీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రూల్స్‌కు విరుద్ధంగా ఓబీ కాంట్రాక్ట్ కంపెనీ 46 రోజులుగా ఓబీ పనులను నిలిపివేసింది. దీంతో సింగరేణి సంస్థ రూ.7.50 కోట్ల విలువైన సుమారు 3.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని కోల్పోయ్యింది. ఓబీ కాంట్రాక్ట్ కంపెనీ చేతులెత్తేయడంతో మట్టి వెలికితీత పనులను సింగరేణి సొంతగా చేపట్టనుంది. ఓబీ వెలికితీతకు అవసరమైన 21 డంపర్లు, 4 శావల్స్వాహనాల సేకరణకు అర్డర్కూడా ఇచ్చింది. వాహనాలు రాగానే పనులు చేపట్టనుంది. ఇందుకు మరో నెల టైం పడుతుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఆర్కేపీ ఓసీపీలో ఓబీ వెలికితీసే డాట్ కంపెనీ, సింగరేణి మధ్య నెలకొన్న వివాదంతో ఓసీపీ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటుండగా గనిని మూసివేస్తారని ఉద్యోగులు భయపడుతున్నారు. అయితే యాజమాన్యం మాత్రం మరో నాగుగేండ్ల వరకు ఓసీపీ నడుస్తుందని భరోసా కల్పిస్తోంది.
చర్యలకు సిద్ధం..
నిబంధనలు పాటించకుండా ఓబీ పనులు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీపై చర్యలు తీసుకునేందుకు సింగరేణి టాప్ మేనేజ్మెంట్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీని టెర్మినేట్ చేయించాలని యాజమాన్యం భావిస్తోంది. బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతున్న నేపథ్యంలో స్వయాన సింగరేణి డైరెక్టర్లు రంగంలోకి దిగి సంబంధిత కంపెనీ బాధ్యులతో చర్చించినా వినకపోవడంతో కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆరేండ్ల కాలపరిమితిలో సుమారు 1,896 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని వెలికితీసే పనులను సింగరేణి 2016 ఫిబ్రవరిలో డాట్ అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. అయితే మొదటి నుంచి ఈ కంపెనీ ఓబీ వెలికితీతపై జాప్యం చేస్తునే ఉంది. 50 డంపర్లు, 12 శావల్ మెషీన్లతో సుమారు 1200 మంది కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేపట్టింది. ప్రతి ఏటా నిర్దేశిత టార్గెట్ మాత్రం చేరుకోలేదు. రాజకీయ అండతో సింగరేణిపైనే ఒత్తిళ్లు తెచ్చిందన్న ఆరోపణలున్నాయి.
ఎవరి వాదన వారిదే…
ఆర్కేపీ ఓసీపీలో ఓబీ వెలికితీత పనులు అప్పగించే టైంలో ఇచ్చిన ప్లానింగ్ కు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని డాట్ కంపెనీ వాదిస్తోంది. ఓల్డ్ ప్లానింగ్ ప్రకారం గనిలో ఒక్కో బెంచ్ కనీసం 20 మీటర్లు వెడల్పు ఉండేదని.. దీంతో వెహికల్స్ సులువుగా వెళ్లేవని చెబుతోంది. కొత్త ప్లానింగ్ పేరుతో 15 మీటర్లకు కుదించడంతో మట్టి తీయడం కష్టంగా మారిందని పేర్కొంటుంది. సేఫ్టీ కూడా లేదని, సింగరేణి అకారణంగా డీజిల్ ఫైన్లు వేస్తుందని ఆరోపిస్తుంది. అయితే డాట్ కంపెనీ వాదనలను సింగరేణి యాజమాన్యం తోసిపుచ్చుతోంది. సింగరేణి యాజమాన్యం ఓబీ వెలికితీత విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోదని, కేవలం సేఫ్టీ నిబంధనల అమలు మాత్రమే పర్యవేక్షిస్తుందని ఆఫీసర్లు అంటున్నారు. డాట్ కంపెనీ డీజిల్ ఫైన్ల రూపంలో సుమారు రూ.30 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని, వాటిని ఎగ్గొట్టేందుకే ఇలా చేస్తుందనే
ఆరోపణలు వినిపిస్తున్నాయి.