సింగరేణిలో కొత్త ట్రాన్స్​ఫర్స్​ గైడ్​లైన్స్​పై..భగ్గు మంటున్న కార్మికులు

సింగరేణిలో కొత్త ట్రాన్స్​ఫర్స్​ గైడ్​లైన్స్​పై..భగ్గు మంటున్న కార్మికులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి యాజమాన్యం కొత్తగా రూపొందించిన ట్రాన్స్​ఫర్స్​ గైడ్​ లైన్స్​పై కార్మికులు, సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఈ గైడ్​ లైన్స్​ను జూన్​ మొదటి వారం నుంచి అమలు చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. కంపెనీలో జనవరి నుంచి మే 31 వరకు ఐదు  నెలలుగా కార్మికుల ట్రాన్స్​ఫర్స్​పై యాజమాన్యం నిషేధం విధించింది. జూన్​ నుంచి ట్రాన్స్​ ఫర్స్​ అవుతాయని ఎదురుచూస్తున్న తమ ఆశలపై కొత్త నిబంధనలు నీళ్లు పోస్తున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి ట్రాన్స్​ ఫర్స్​ దరఖాస్తులన్నీ ఆన్​లైన్​లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోకల్ ​పాయింట్స్​లలో ఉన్న వారిని నాన్​ ఫోకల్​ పాయింట్స్​కు ట్రాన్స్​ఫర్ చేయాలనే నిబంధనను పక్కాగా అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. పర్చేజ్, కోల్​బ్రాంచ్, స్టోర్స్, రిక్రూట్మెంట్​సెల్, అకౌంట్స్​ లాంటి కీలక పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులు నాలుగేండ్లు సర్వీస్​ పూర్తి అయితే ట్రాన్స్​ ఫర్స్​చేయడం, ఈ కీలక పోస్టుల్లో ఇప్పటికే పనిచేసిన వారిని తిరిగి అదే పోస్టుల్లోకి బదిలీ చేయడంపై యాజమాన్యం నిషేధం విధించింది.

తన సర్వీస్​లో కేవలం రెండు సార్లు మాత్రమే రిక్వెస్ట్​ ట్రాన్స్​ఫర్స్​కు అవకాశ ఉండడం, మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్స్​కు పదేండ్ల సర్వీస్​ సంబంధిత ఏరియాలో పనిచేసిన అనుభవం ఉండకూడదన్న నిబంధనలపై కార్మికులతోపాటు ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్​, హెచ్​ఎమ్మెస్​ సంఘాల నేతలు మండి పడుతున్నారు. నిబంధనలపై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ప్రతినిధులతో కనీసం చర్చించకుండా ఏకపక్షంగా యాజమాన్యం అమలు చేసేందుకు ముందుకు రావడం పట్ల అసహనం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.