ఎంఎస్ సుబ్బలక్ష్మి స్థాయికి.. స్వర రాగ గంగా ప్రవాహం

ఎంఎస్ సుబ్బలక్ష్మి స్థాయికి.. స్వర రాగ గంగా ప్రవాహం

పసి ప్రాయం నుంచే సంగీతంపై ఆసక్తిపెంచుకుంది. రెగ్యులర్‌ ప్రాక్టీస్‌ తో ఆ సప్తస్వరాలపై పట్టు సాధించింది. ఎక్కువగా భక్తిగీతాలను పాడుతూ సంగీత ప్రియులను ఓలలాడిస్తోంది. ఆమె మాళవికా ఆనంద్‌ . ఇప్పటివరకు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మరాఠీభాషల్లో ఎన్నో పాటలను పాడింది. మాళవిక ఆనంద్ మైసూరులో పుట్టినా హైదరాబాద్‌ లోపెరిగింది. ఇప్పటి వరకు 220 ప్రదర్శనలిచ్చి మూడు సీడీలను విడుదల చేసింది. తొమ్మిదేళ్ల వయసులో గురువు కళానిధి రేవతి రత్నస్వామి సహకారంతో ఆధ్యాత్మిక గీతాలతో కూడిన తొలి ఆల్బమ్ ను విడుదల చేసింది. 12 ఏళ్ల వయసులో రామదాసు కీర్తనలతో కూడిన రెండో ఆల్బమ్‌‌ విడుదల చేసింది. మైసూరు దసరా ఉత్సవాల్లో, భద్రాద్రి రామయ్య సన్నిధిలో, ఎస్వీబీసీ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో తనగాత్రంతో ఎందరినో ఆకట్టుకుంది మాళవికా. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేపడుతున్న వివిధ పథకాల సమాహారాన్ని వీడియోపాటగా రూపొందించి విడుదల చేసింది. 75వ సంగీత ప్రదర్శన సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్ సంస్థ యువ గానకోకిల బిరుదుతో మాళవిక ఆనంద్ ను సత్కరించింది. మాళవిక పాట విన్న గవర్నర్ నరసింహన్ దంపతులు ఆమెను ప్రశంసించారు.

ఆలిండియా రేడియోనుంచి ఇటీవల గ్రేడెడ్ ఆర్టిస్ట్ గుర్తింపు దక్కించుకుంది. యూనిక్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ఆఫ్ రికార్డ్స్, బాల రత్న, యువరత్న పురస్కారాలను దక్కించుకుంది. తెలంగాణ స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించింది. ప్రస్తుతమూ హైదరాబాద్ సిస్టర్స్ గా పేరుగాంచిన హరిప్రియ, లలిత వద్ద శిక్షణ పొందుతోంది. నిత్య సంతోషిణి వద్ద లైట్ మ్యూజిక్ సాధన చేస్తోంది. సంగీతమే శ్వాసగా సాగుతున్న మాళవిక ప్రసుత్తం బీకాం చదువుతోంది.

ఎంఎస్ సుబ్బలక్ష్మి స్థాయికి ఎదగాలి
లలిత సంగీతంతో పోలిస్తే శాస్త్రీయసంగీతం చాలా కష్టమైనది. సంగీతం అంటే ఇష్టమున్న ఇప్పటితరం ఎక్కువగా లైట్ మ్యూజిక్, వెస్ట్రన్ మ్యూజిక్ వైపే దృష్టి సారిస్తోంది.మరిచి పోతున్నశాస్త్రీయ సంగీతాన్ని ఈ జనరేషన్ కు తెలియజెప్పాలనేది నా ప్రయత్నం . అందుకే చిన్నప్పటి నుంచి నా గురి శాస్త్రీయ సంగీతం పైనే..నా వంతుగా క్లాసికల్ మ్యూజిక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటా. అలాగే ఫంక్షన్లకు అతిథిగా వెళ్లినప్పుడు శాస్త్రీయ సంగీతం ప్రాముఖ్యతను వివరిస్తుంటా . ఎంఎస్ సుబ్బ లక్ష్మిలా గొప్ప స్థాయికి వెళ్లాలనేది నా కోరిక. నాకు ఆవిడే స్ఫూర్తి. -మాళవిక ఆనంద్ సితార్‌