
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం మరణించారు. చెన్నైలోని తన నివాసంలో అనారోగ్యంతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, మరాఠీ సహా 14 భాషల్లో దాదాపు 8వేలకుపైగా పాటలు పాడారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించిన వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. ఆమె ఉత్తమ గాయనిగా మూడుసార్లు నేషనల్ అవార్డు అందుకున్నారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగాళ్' సినిమాలో పాటలకుగానూ తొలసారి నేషనల్ అవార్డు అందకోగా.. మిగతా రెండుసార్లు కె. విశ్వనాథ్ సినిమాల్లోని పాటలకు అందుకున్నారు. శంకరాభరణం, స్వాతి కిరణం సినిమాల్లోని పాటలకు ఆమె జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇటీవలే కేంద్రం ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ ప్రకటించింది. ఆ అవార్డు అందుకోకముందు ఆమె కన్నుమూయడం విషాదం.