పెద్దపల్లి, వెలుగు: ఒకే రోజు తండ్రి, కొడుకు చనిపోయిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం(56), అతని కొడుకు ఎరుకల శ్రీకాంత్(37) గురువారం తెల్లవారుజామున చనిపోయారు. రాజేశంకు పక్షవాతం రావడంతో ఇంటి వద్దనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో శ్రీకాంత్‌కు బుధవారం రాత్రి చాతీలో నొప్పి రావడంతో గోదావరిఖనిలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. తెల్లవారుజామున శ్రీకాంత్ చికిత్స పొందుతూ చనిపోగా, విషయం తెలుసుకున్న తండ్రి రాజేశం కొద్ది సేపటికే మరణించాడు. ఒకే ఇంట్లో, ఒకే రోజు తండ్రి, కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. న్యూ ఇయర్ రోజు ఈ ఘటన జరగడంతో నాగెపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తరలివచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
