కరోనా రికవరీలకు టీకా ఒక్క డోసు చాలు

 కరోనా రికవరీలకు టీకా ఒక్క డోసు చాలు

హైదరాబాద్: వ్యాక్సిన్ ప్రభావశీలతపై ఎన్నో స్టడీలు జరుగుతున్నాయి. ఏ టీకా ఎంత సమర్థంగా పని చేస్తుంది, ఏయే వేరియంట్‌లపై ఎంత ప్రభావవంతంగా వర్క్ చేస్తుందో తెలుసుకునేందుకు రీసెర్చర్స్ శ్రమిస్తున్నారు.  ఈ  నేపథ్యంలో కరోనా బారిన పడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ ఒక్క డోసు సరిపోతుందని ఓ స్టడీలో తెలిపింది. కరోనా రికవరీలకు కొవిషీల్డ్ సింగిల్ డోసు ఇస్తే చాలని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 16 నుంచి ఫిబ్రవరి 5 వరకు 260 మంది హెల్త్‌కేర్ వర్కర్లపై ఏఐజీ ఆస్పత్రి ఓ స్టడీని చేపట్టింది. వీరిలో మంచి ఇమ్యూనలాజికల్ మెమరీ రెస్పాన్స్‌ను గుర్తించామని రీసెర్చర్స్ తెలిపారు. 

‘కరోనా రికవరీలకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రికవరీ పేషెంట్లలో సింగిల్ డోస్‌తో అవసరమైన యాంటీబాడీలు, మెమరీ సెల్‌ రెస్సాన్స్‌‌ రావడాన్ని గమనించాం. వ్యాక్సిన్‌ల కొరత ఉన్నందున కరోనా వచ్చి నయమైన వారికి సింగిల్ డోసు ఇవ్వాలి. తద్వారా టీకా అందని చాలా మందికి వ్యాక్సినేషన్ చేయొచ్చు. దీంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడినట్లవుతుంది’ అని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి అన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీని చేరుకునేందుకు ఎక్కువ శాతం మందికి వ్యాక్సినేషన్ చేయాలని నాగేశ్వర్ చెప్పారు. ఈ క్రమంలో కరోనా రికవరీలకు సింగిల్ డోస్ ఇస్తే చాలా మొత్తంలో టీకాలు మిగులుతాయన్నారు. వాటిని ఒక్క డోసు కూడా తీసుకోని మిగతా ప్రజలకు అందించొచ్చన్నారు.