సింగోటం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

సింగోటం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
  •     ఈ నెల 15 నుంచి లక్ష్మీ నరసింహ్మా స్వామి ఉత్సవాలు
  •     సమీక్షలో పాల్గోన్న మంత్రి జూపల్లి,జిల్లా కలెక్టర్​,ఎస్పీ

కొల్లాపూర్,వెలుగు:  సింగోటం  లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఈనెల 15 నుంచి 21 వరకు జరిగే ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు.

శుక్రవారం దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, దేవాలయ ట్రస్టీ ఆదిత్య లక్ష్మణ్‌‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి, కలెక్టర్, ఎస్పీకి ఆలయ అర్చకులు ఓరుగంటి సంపత్ కుమార్ శర్మ, సతీష్ శర్మ పూర్ణకుంభ స్వాగతం పలికి, దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ ఆదాయం, ఖర్చులపై సమీక్షించి, అన్ని పనుల టెండర్లను ఆన్‌‌లైన్‌‌లో నిర్వహించాలని ఆదేశించారు. రాయలసీమ భక్తుల కోసం నందికొట్కూరు, కర్నూలు నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.  సోమశిల, మంచాలకట్ట వద్ద టూరిజం బోట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. 

రథోత్సవం రోజు ప్రతి గ్రామం నుంచి బస్సులు నడపాలని, అదనపు బస్సులు తెప్పించాలని కొల్లాపూర్ డీఎంకు ఆదేశించారు. వైద్య శిబిరాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలన్నారు. దేవాలయ పరిసరాల్లో ముళ్ల పొదలు తొలగించి, గుండం నీటిని మార్చాలని సూచించారు. సింగోటం రిజర్వాయర్ కట్టపై విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని, గుడారాల నిర్వహణ గ్రామ పంచాయతీ సిబ్బంది చూడాలని డీపీఓను ఆదేశించారు. గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 

బ్రహ్మోత్సవాల సందర్భంగా 3 లక్షల మంది భక్తులు దర్శించుకోనున్నట్లు తెలిపారు.   జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ, జాతరను భక్తి శ్రద్ధలతో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.  కొల్లాపూర్‌‌లోని ఆత్మ జ్ఞాని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ వార్షికోత్సవంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. 

ధ్యానంతో మానసిక ప్రశాంతత సాధ్యమని, ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. సమాజంలో మహిళలపై అత్యాచారాలు, వేధింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను వ్యసనాల నుంచి మళ్లించాలన్నారు. అనంతరం శాకాహార ర్యాలీని ప్రారంభించారు. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ ఆదిత్య లక్ష్మణ్ రావు, ఆర్డీవో బన్సీలాల్, డీఎస్పీ శ్రీనివాసులు, ఈవో రంగారావు, సర్పంచ్ ఆదిరాల యాదయ్య గౌడ్   పాల్గొన్నారు.