‘సర్’ డ్యూటీలో ప్రాణాలు బలి! ప్రెజర్ తట్టుకోలేకపోతున్న BLOలు

‘సర్’ డ్యూటీలో ప్రాణాలు బలి! ప్రెజర్ తట్టుకోలేకపోతున్న BLOలు
  • టైం తక్కువ.. వర్క్ ఎక్కువ.. 
  • వివిధ రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు.. ఆత్మహత్యలు 
  • యూపీలో 10 రోజుల్లో 9 మంది మృతి.. వీరిలో ముగ్గురు సూసైడ్ 
  • బెంగాల్​లో సర్ వల్ల 40 మంది చనిపోయారన్న టీఎంసీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) డ్యూటీలో ఉన్న బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్​వో)లు పని ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. టైం తక్కువగా ఉండటం.. చేయాల్సిన పని ఎక్కువగా ఉండటంతో ప్రెజర్ తట్టుకోలేక కుంగిపోతున్నారు. దీనికితోడు డెడ్ లైన్ లోపు పని పూర్తి చేయకుంటే ఉద్యోగాల నుంచి తీసేస్తామంటూ పై ఆఫీసర్ల నుంచి వార్నింగ్​లు వస్తుండటంతో కొందరు తీవ్ర ఆందోళనతో గుండెపోటుకు గురై చనిపోతున్నారు. 

మరికొందరు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తిండి, నిద్ర కూడా పట్టించుకోకుండా 14, 15 గంటలు పనిచేసినా.. టార్గెట్​ను చేరుకోలేకపోతుండటంతో అనేక మంది అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇప్పటివరకు ఒక్క యూపీలోనే గత 10 రోజుల్లోనే 9 మంది సర్ డ్యూటీలో ప్రెజర్ తట్టుకోలేక చనిపోయారు. 

వీరిలో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్​లో ఏకంగా 40 మంది సర్ డ్యూటీలో ప్రెజర్ కారణంగా చనిపోయారని టీఎంసీ సర్కార్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ పలువురు బీఎల్ వోలు గుండెపోటుతో చనిపోవడం, మరికొందరు ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు నమోదయ్యాయి.

బీఎల్ వోలు, ప్రతిపక్షాల మండిపాటు 

సర్ డ్యూటీలో విపరీతమైన ప్రెజర్​పై బీఎల్​వోలు ఆందోళనలకు దిగుతున్నారు. వారికి ప్రతిపక్షాలు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాయి. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఇద్దరు బీఎల్​వోలు సూసైడ్​ చేసుకోవడంతో  ఆ జిల్లాలోని బీఎల్​వోలంతా ఆందోళనకు దిగారు. వర్క్​ను బాయ్ కాట్ చేశారు. అలాగే బెంగాల్​లో బీఎల్​వోలు ఈసీ ఆఫీసు ముందు ధర్నా చేశారు. వారికి అధికార టీఎంసీ పార్టీ మద్దతు పలికింది.

ఆందోళనలతో డెడ్ లైన్ పొడిగింపు 

రెండో విడత సర్ కోసం బీఎల్​వోల ద్వారా ఫారాల అప్ లోడ్ ప్రక్రియను నవంబర్ 4న ప్రారంభించి, డిసెంబర్ 4న ముగించాలని ఈసీ ఆదేశించింది. ట్రెయినింగ్​ ఆలస్యం కావడంతో సిబ్బంది నవంబర్​ 9 నుంచి ప్రకియను ప్రారంభించారు. 

ట్రెయినింగ్ కూడా తూతూమంత్రంగా నిర్వహించడంతో ఫారాల్లో వివరాల నమోదు, అప్ లోడ్ ప్రక్రియలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చివరకు తెల్లవారుజామునే మొదలుపెట్టి.. రాత్రి వరకూ కొనసాగించినా టార్గెట్లను రీచ్ కాలేకపోతున్నారు. 

ఈ నేపథ్యంలో డెడ్ లైన్ ను ఈసీ డిసెంబర్ 11 వరకూ వారం రోజుల పాటు పొడిగించింది. కాగా, బీఎల్​వోల మరణాలపై సుమోటో విచారణ చేపట్టాలని జాతీయ మానవ హక్కుల సంఘానికి ముంబైకి చెందిన అడ్వొకేట్​ హితేంద్ర ఫిర్యాదు చేశారు. 

ఒక్కొక్కరు 1,000 ఫారాలు..

రెండో విడత సర్ ప్రక్రియను గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్, బెంగాల్, కేరళ సహా 
12 రాష్ట్రాల్లో ఈసీ నవంబర్ 4న ప్రారంభిం చింది. ఫీల్డ్ లెవల్​లో ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో సేకరించి.. ఆ ఫారాలను వెబ్ సైట్​లో అప్​లోడ్ చేసేందు కు గాను ఈసీ బీఎల్ వోలను నియమించిం ది. ఇందులో అత్యధికంగా టీచర్లు, అంగన్ వాడీ సిబ్బందే ఉన్నారు. రోజుకు రూ.500 రెమ్యునరేషన్ ఇస్తున్న ఈసీ.. తమతో బండెడు చాకిరీ చేయించుకుంటోందని బీఎల్​వోలు ఆందోళన చెందుతున్నారు. 

పై ఆఫీసర్లు రోజువారీగా టార్గెట్లు పెడుతున్నా రని, పూర్తి చేయకుంటే ఉద్యోగాల నుంచి తీసేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్తున్నారు. తిండి, నిద్ర మాని పనిచేస్తున్నా.. క్షేత్ర స్థాయి లో సమస్యల కారణంగా తాము టార్గెట్లను రీచ్ కాలేకపోతున్నామని చెప్తున్నారు. సగటున ఒక్కో బీఎల్ వో 1,000 మంది ఫారాలను అప్​లోడ్ చేయాలని టార్గెట్ పెట్టారని.. కానీ ఓటర్లు ఇంటి పట్టున ఉండకపోవడంతో ఐదారుసార్లు తిరిగినా పని కావట్లేదని అంటున్నారు.