న్యూఢిల్లీ: ఎలక్షన్కమిషన్నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్రివిజన్(సర్)ను కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రక్రియ సజావుగా సాగేలా రాష్ట్ర ప్రభుత్వాలు, ఈసీ కృషి చేయాలని ఆదేశించింది. సర్ విధుల్లో పాల్గొనే బూత్ లెవల్ ఆఫీసర్ల(బీఎల్వోల)కు బెదిరింపులను సహించేది లేదని హెచ్చరించింది. బెదిరింపులకు అడ్డుకట్ట వేయకపోతే అరాచకానికి దారితీయొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
దీన్ని వెంటనే పరిష్కరించాలని తేల్చిచెప్పింది. పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బీఎల్వోలకు, ఇతర అధికారులకు బెదిరింపులు వస్తున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలంటూ సనాతనీ సంఘట్అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
బెంగాల్‌లోని పరిస్థితిపై సీరియస్ అయింది. బీఎల్వోల విధులకు ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. ‘‘బీఎల్వోలు తమ విధులకు ఆటంకాలు, బెదిరింపులు ఎదుర్కొంటే మా దృష్టికి తీసుకురావాలి. రక్షణ కోసం తగిన ఆదేశాలు జారీ చేస్తాం’’ అని ధర్మాసనం తెలిపింది. పశ్చిమ బెంగాల్లో బీఎల్వోలకు బెదిరింపులు ఎక్కువయ్యాయని, వారికి రక్షణ కోసం రాష్ట్ర పోలీసు అధికారులను డిప్యుటేషన్‌పై ఈసీకి ఇచ్చేలా చూడాలని, సర్ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని పిటిషనర్ అభ్యర్థించారు.
దీనిపై బెంగాల్ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు వివరణ కోరింది. ఈసీ తరఫున సీనియర్అడ్వకేట్రాకేశ్ ద్వివేది తన వాదనలు వినిపిస్తూ.. “సర్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. మా సిబ్బందికి ఆయా ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి. ఒక వేళ నిరాకరిస్తే.. స్థానిక పోలీసులను డిప్యుటేషన్‌పై మేం తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. పరిస్థితి చేయిదాటితే కేంద్ర బలగాల సాయం తీసుకోవాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్సూర్యకాంత్ స్పందిస్తూ.. పరిస్థితి తీవ్రంగా ఉందని, సరిదిద్దకపోతే అరాచకానికి దారితీయొచ్చని పేర్కొన్నారు. విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించొద్దన్నారు. అరాచకశక్తులకు అడ్డుకట్ట వేయాలని, బీఎల్వీలకు రక్షణ కల్పించాలని ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇన్ని పిటిషన్లా.. సర్‌ను రాజకీయం చేయొద్దు
సర్‌ను వ్యతిరేకిస్తూ, దాని చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాల నుంచి భారీగా పిటిషన్లు దాఖలవుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎన్ని పిటిషన్లు వేస్తారు..? ఒకే అంశంపై ఇన్ని పిటిషన్లా..? మీరు పిటిషన్లు వేస్తనే ఉండండి.. రాజకీయం చేస్తనే ఉండండి” అంటూ అసహనం వ్యక్తం చేసింది. కేవలం కొందరు ప్రచారం కోసమే పిటిషన్లు వేస్తున్నట్లు ఉందని తప్పుబట్టింది. రాష్ట్రాల వారీగా పిటిషన్లను విడదీసి విచారించాల్సి ఉంటుందని తెలిపింది.

