హేయ్ సిరి: ఓ నిండు ప్రాణం నిలబెట్టిన టెక్నాలజీ!

హేయ్ సిరి: ఓ నిండు ప్రాణం నిలబెట్టిన టెక్నాలజీ!

స్మార్ట్‌నెస్.. స్మార్ట్ టెక్నాలజీ ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టినయ్! కొద్ది నిమిషాలు ఆలస్యమైనా నదిలో జల సమాధి అయిపోయేవాడో కుర్రాడు. టీనేజ్‌లోనే ట్రాజడీగా మిగిలిపోకుండా ఒడ్డున పడేసింది ఐ ఫోన్. అదెలా అంటే.. హేయ్ సిరి అని పిలిస్తే చాలు.. ఐ ఫోన్ టక్కున పలుకుతుంది. వాయిస్ అసిస్టెడ్ టెక్నాలజీ సాయంతో ఫోన్‌ని ముట్టుకోకుండానే కాల్స్ చేయొచ్చు. ఇంకా ఐ ఫోన్‌లో మ్యూజిక్ ప్లే చేయడం సహా చాలా పనులు చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీనే నదిలో మునిగిపోయే కుర్రాడిని కాపాడింది.

అమెరికాలోని చార్లెస్ సిటీకి చెందిన గేల్ అనే 18 ఏళ్ల కుర్రాడు కారులో వెళ్తుండగా రోడ్డుపై మంచు వల్ల కంట్రోల్ చేయలేకపోయాడు. రోడ్డు పక్కనే ఉన్న గడ్డకట్టిన లోవా నదిలోకి కారు దూసుకెళ్లింది. కారు వేగానికి మంచులో కూరుకునిపోయి.. లోపలికి దిగిపోసాగింది. ఆపద సమయంలో ఏం చేయాలో ఒక్క క్షణం పాటు అర్థం కాకుండాపోయింది. గేల్ 911 ఎమర్జెన్సీ హెల్స్ లైన్‌కు ఫోన్ చేద్దామన్నా.. కారు స్పీడ్‌గా నదిలోకి దూసుకెళ్లిన సమయంలో జేబులో నుంచి కిందపడిపోయింది. అది ఎక్కడుందో అతడికి అర్థం కాలేదు. వెంటనే సమయ స్ఫూర్తితో ‘హేయ్ సిరి’ అంటూ 911కి కాల్ చేయాల్సిందిగా వాయిస్ కమాండ్ ఇచ్చాడు. జీపీఎస్ లొకేషన్ కంట్రోల్ రూమ్‌కి చేరడంతో కొద్ది నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్, అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది గేల్‌ని రక్షించారు. డిసెంబరు 10న జరిగిన ఈ  ఘటన గురించి కెర్రో గోర్డో కౌంటీ అధికారులు ప్రెస్ రిలీజ్ ద్వారా తెలియజేశారు.