ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు

ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి.  జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించిన అంత్యక్రియలకు సిరివెన్నెల కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు ఆయన అంతిమసంస్కారాలు నిర్వహించారు. ఉదయం ఫిలిం చాంబర్ లో ఆయన పార్ధీవదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. సిరివెన్నెల ఎంతో ఆత్మీయంగా పలకరించేవారని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పలువులు ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. అద్భుతమైన సాహిత్యంతో, వాస్తవాలకు దగ్గరగా సిరివెన్నెల పాటలు రాశారని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల పార్థీవదేహానికి నివాళులు అర్పించిన పలువురు సినీనటులు కన్నీటి పర్యంతం అయ్యారు.

కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల... గత నెల 24 నుంచి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ... నిన్న తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి..  1955 మే 20న విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించారు. ఆయన అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో 800 చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు రాశారు. సినీ సాహిత్యానికి చేసిన సేవలకుగానూ 2019లో సిరివెన్నెలను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.  అంతేకాకుండా.. సిరివెన్నెల నాలుగు  ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఉత్తమ గేయ రచయితగా 11 సార్లు నంది అవార్డులు అందుకున్నారు.