దిశ ఎన్ కౌంటర్ స్పాట్ కు కమిషన్

దిశ ఎన్ కౌంటర్ స్పాట్ కు కమిషన్
  •     సీఆర్పీఎఫ్​ బందోబస్తు మధ్య పరిశీలన
  •     షాద్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిసరాల తనిఖీ 


షాద్​నగర్​/శంషాబాద్​, వెలుగు: దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్​కౌంటర్​కు సంబంధించి జస్టిస్​ సిర్పూర్కర్​ కమిషన్​ విచారణ చివరి దశకు వచ్చింది. ఘటన జరిగిన చటాన్​పల్లి బ్రిడ్జి, నిందితులను ఎన్​కౌంటర్​ చేసిన ప్రదేశాలను కమిషన్​ ఆదివారం భారీ బందోబస్తు మధ్య పరిశీలించింది. కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ సిర్పూర్కర్​, సభ్యులు జస్టిస్​ రేఖ, మాజీ డీజీపీ కార్తికేయ, సిట్​అధికారి రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​, శంషాబాద్​ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి తదితరులు 18 వెహికల్స్​ కాన్వాయ్​లో సీఆర్పీఎఫ్​ బలగాల బందోబస్తు మధ్య అక్కడకు వెళ్లారు. దిశ ఘటన, నిందితుల ఎన్​కౌంటర్​ తీరు, ఎన్​కౌంటర్​కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 40 నిమిషాల పాటు అక్కడే దర్యాప్తు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సభ్యులను కలిసేందుకు ప్రజా సంఘాల నేతలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఘటనా స్థలం నుంచి షాద్​నగర్​ పోలీస్​ స్టేషన్​కు కమిషన్​ సభ్యులు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. అక్కడ కూడా స్థానికులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. విచారణ నివేదికను వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్​ కమిషన్​ అందజేయనుంది. 

కమిషన్​ సభ్యులను కలిసిన దిశ తండ్రి
దిశ బైకు ఆపిన తొండుపల్లి గేట్​ వద్ద కమిషన్​ సభ్యులు విచారణ చేస్తున్న సమయంలో దిశ తండ్రి అక్కడకు వెళ్లారు. కమిషన్​ సభ్యులను కలిసి కాసేపు మాట్లాడారు. న్యాయం జరుగుతుందని కమిషన్​ సభ్యులు హామీ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. 2019 నవంబర్​ 27న వెటర్నరీ డాక్టర్​ దిశను నలుగురు యువకులు చటాన్​పల్లి వద్ద అత్యాచారం చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకు అదే ఏడాది డిసెంబర్​ 6న దిశ ఘటన జరిగిన స్థలంలోనే నిందితులు ఎన్​కౌంటర్​లో చనిపోయారు. అది బూటకపు ఎన్​కౌంటర్​ అని పేర్కొంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎన్​కౌంటర్​పై సమగ్ర దర్యాప్తు కోసం సిర్పూర్కర్​ కమిషన్​ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఎన్​కౌంటర్​లో పాల్గొన్న అధికారులందరినీ కమిషన్​ విచారించింది.