అంతమంది పోలీసులుంటే ఆయుధాలెట్ల గుంజుకున్నరు?

అంతమంది పోలీసులుంటే ఆయుధాలెట్ల గుంజుకున్నరు?
  • ‘దిశ’ నిందితుల ఎన్​కౌంటర్​పై సిర్పూర్కర్​ కమిషన్​ రిపోర్ట్​
  • పది మంది పోలీసులపై కేసు పెట్టి విచారించాలి
  • 387 పేజీల నివేదిక సుప్రీంలో ముగిసిన విచారణ 
  • హైకోర్టుకు కేసు బదిలీ రిపోర్టును సీల్డ్​ కవర్​లో ఉంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం
  • బహిరంగ విచారణ జరిగిన తర్వాత దాచడం ఎందుకన్న సుప్రీం 

న్యూఢిల్లీ, వెలుగు: ‘దిశ’ నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో పోలీసులు చెప్తున్నది నమ్మేలా లేదని జస్టిస్​ సిర్పూర్కర్​ కమిషన్​ పేర్కొంది. ఈ మేరకు 387 పేజీల నివేదికను ఇటీవల సుప్రీంకోర్టుకు కమిషన్​ సమర్పించింది. 2019 డిసెంబర్​లో హైదరాబాద్​ శివారులో వెటర్నరీ డాక్టర్​ దిశపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితులుగా ఉన్న చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్, మహ్మద్ ఆరీఫ్​ను చట్టానికి అతీతంగా పోలీసులు చంపారని రిపోర్టులో తెలిపింది.  ‘‘నిందితులు తుపాకులను గుంజుకొని పారిపోతూ కాల్పులు జరిపినట్లు, అందులో భాగంగానే తామూ ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్తున్న వాదనలో వాస్తవం లేదు. పోలీసులు ఆత్మరక్షణ కోసమో లేక మళ్లీ అరెస్టు చేయడం కోసమో కాల్పులు జరపలేదు. ఉద్దేశపూర్వకంగానే జరిపారు” అని కమిషన్​ పేర్కొంది. నిందితులపై కాల్పులు జరిపిన పది మంది పోలీసులు వి.సురేందర్ రెడ్డి, కె.నర్సింహారెడ్డి, కె. వెంకటేశ్వర్లు, ఎస్. అరవింద్ గౌడ్, డి.జానకిరామ్, ఆర్. బాలు రాథోడ్, డి. శ్రీకాంత్ , షేక్ లాల్ మదార్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చర్ల రవిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చెయ్యాలని సూచించింది. వీరంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. 

ఎన్​కౌంటర్లపై అధ్యయనానికి 16 సిఫార్సులు

దేశవ్యాప్తంగా ఎన్​కౌంటర్లపై లోతుగా అధ్యయనం చెయ్యాలని కూడా  జస్టిస్​ సిర్పూర్కర్​ కమిషన్​ తన నివేదికలో 16  సిఫార్సులు చేసింది. ప్రజలకు సేవ చెయ్యాల్సిన పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ప్రజల్లో అప్పటికప్పుడు ఉన్న భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకొని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచి పద్ధతి కాదని పేర్కొంది.ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు వారి శరీరాలకు కెమెరాలను తగిలించుకోవాలని  సూచించింది.

ఎన్​కౌంటర్​ కేసు హైకోర్టుకు బదిలీ

దిశ నిందితుల ఎన్ కౌంటర్  కేసును శుక్రవారం సుప్రీంకోర్టులో సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం విచారించింది. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సమర్పించిన రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్​ శ్యామ్​ దివాన్​ రిక్వెస్ట్​ చేయగా కోర్టు తిరస్కరించింది. బహిరంగ విచారణ జరిపాక నివేదిక దాయడం ఎందుకని ప్రశ్నించింది. నివేదికలో దాచుకోవాల్సింది ఏమీ లేదని, తాము రిపోర్టును చూశామని, దోషులు ఎవరో తేలిపోయిందని పేర్కొంది. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో తప్ప రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని బెంచ్​ తేల్చిచెప్పింది. ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు పక్షాలకు సిర్పూర్కర్​ కమిషన్​ రిపోర్ట్ కాపీలను అందించాలని, కమిషన్ నివేదికను హైకోర్టుకు పంపాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు హైకోర్టుకు పంపిస్తున్నట్లు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణను ముగిస్తున్నట్లు చెప్పింది.

అంతమంది పోలీసులుంటే ఆయుధాలెట్ల గుంజుకున్నరు?

‘దిశ’ కేసులోని నలుగురు నిందితులను సేఫ్​ హౌస్​ నుంచి చటాన్ పల్లికి తీసుకెళ్లే వరకు పోలీసులు చూపించిన రికార్టులన్నీ తప్పని కమిషన్​ పేర్కొంది. అంతమంది పోలీసులు ఉంటే వారి నుంచి నలుగురు నిందితులు ఆయుధాలు గుంజుకోవడం సాధ్యం కాదని తెలిపింది. ‘‘పోలీసులు చెప్తున్నది నమ్మేలా లేదు. నిందితులకు ఆయుధాలు వాడే పరిజ్ఞానం ఉన్నట్లు భావించటం లేదు. నిందితులు దాడి చేస్తే పోలీసులు గాయపడ్డట్లు, వారికి చికిత్స అందించినట్లు చెప్తున్న విషయాలు కూడా పూర్తిగా అవాస్తవం” అని నివేదికలో సిర్పూర్కర్​ కమిషన్​ స్పష్టం చేసింది. వాడిన బుల్లెట్ల వివరాలు కూడా సరిగ్గా లేవని, ఘటన స్థలం దగ్గర పోలీసులు ధ్రువీకరించిన ఆధారాలను కూడా భద్రపర్చలేదని తెలిపింది. 

నాకు దిక్కులేకుండా చేశారు

కోర్టు తీర్పు వచ్చేవరకు కూడా ఆగకుండా పోలీసులు నా భర్తను చంపి, నాకు దిక్కు లేకుండ చేశారు. నాకు మూడేళ్ల పాప ఉంది. కూలి పనులు చేసుకుంట పాపను, అత్తను పోషించుకుంటున్నా. నెల రోజుల కింద యాక్సిడెంట్​​లో మా మామ కుర్మయ్య చనిపోయాడు. నా భర్తను చంపిన పోలీసులను కఠినంగా శిక్షించాలి.  
‌‌‌‌ చెన్నకేశవులు భార్య రేణుక 

న్యాయం జరుగుతుంది 

అభంశుభం తెలియని నా కొడుకును పోలీసులు పట్టుకెళ్లి కాల్చిచంపారు. ఆ పాపం ఊరికే పోదు. కోర్టులు ఉన్నాయి. మాకు న్యాయం జరుగుతుంది.    
- జొల్లు శివ తండ్రి రాజప్ప

పోలీసులకు అదేగతి పట్టాలె 

నా మొగుడు 18 ఏండ్ల కిందట సచ్చిండు. కొడుకును పోలీసులు చంపారు. 14 ఏండ్ల బిడ్డతో దిక్కులేకుండ బతుకుతున్న. మా పిల్లలను చంపిన పోలీసులకు కూడా అదే గతి పట్టాలె. 
- జొల్లు నవీన్ తల్లి లక్ష్మి