ఏడెనిమిది నెలల్లోనే రిలీజ్ అవుతాననుకున్నా: సిసోడియా

ఏడెనిమిది నెలల్లోనే రిలీజ్ అవుతాననుకున్నా: సిసోడియా

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో తాను అరెస్ట్ అయిన తర్వాత ఏడెనిమిది నెలల్లోనే జైలు నుంచి బయటకు వస్తానని అనుకున్నానని, కానీ న్యాయం కోసం 17 నెలలు ఎదురుచూడాల్సి వచ్చిందని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో శుక్రవారం జైలు నుంచి బెయిల్​పై రిలీజ్ అయిన నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని ఆప్ ఆఫీసులో పార్టీ క్యాడర్​ను ఉద్దేశించి సిసోడియా మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని వినియోగించడం ద్వారా నియంతృత్వాన్ని ఓడిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు.

 ‘‘17 నెలలుగా కన్నీళ్లు నా బలాన్ని మరింతగా పెంచాయి. అంతిమంగా నిజాయతీ, సత్యమే గెలిచాయి” అని ఆయన చెప్పారు. ఆప్ నేతలను బీజేపీ కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని, టెర్రరిస్టులు, డ్రగ్ డీలర్స్ మాదిరిగా కఠిన చట్టాలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే బయటకు వస్తారన్నారు. 

తనతోపాటు పార్టీ నేతలంతా గుర్రాలు అయితే.. కేజ్రీవాల్ తమ సారథి అని అభివర్ణించారు. నిజాయతీకి కేజ్రీవాల్ ప్రతిరూపమని, మంచి పనులు చేస్తున్న ఆయనను అపఖ్యాతి పాలు చేసేందుకే కుట్రలు జరుగుతున్నాయన్నారు. అంతకుముందు ఆయన కన్నాట్ ప్లేస్​లోని హనుమాన్ టెంపు ల్​కు వెళ్లి పూజలు చేశారు. రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. 

ప్రతిపక్షాలు ఏకమైతే..

నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష నేతలంతా ఏకమైతే కేజ్రీవాల్ 24 గంటల్లోనే జైలు నుంచి బయటకు వస్తారని సిసోడియా అన్నారు. జైలులో ఉన్నప్పుడు తాను ఎప్పుడూ బెయిల్ కోసం చింతించలేదని, కానీ బీజేపీకి విరాళాలు ఇవ్వలేదన్న కారణంతో వ్యాపారవేత్తలపై ఫేక్ కేసులు పెట్టి జైలులో వేయడం చాలా బాధించిందన్నారు. 

ఒలింపిక్స్​లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతపై పరోక్షంగా స్పందిస్తూ.. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఆమెకు ఒలింపిక్స్​లో ఏం జరిగిందో అందరూ చూశారన్నారు. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. నియంతృత్వంపై పోరాడాల్సిన బాధ్యత ఆప్ కార్యకర్తలతోపాటు దేశ ప్రజలపై కూడా ఉందన్నారు.  

మార్నింగ్ టీతో సెల్ఫీ  

శనివారం ఉదయం సిసోడియా తన భార్యతో కలిసి టీ తాగుతూ సెల్ఫీ తీసి ట్వీట్ చేస్తూ.. ‘‘17 నెల ల తర్వాత స్వేచ్ఛగా మొదటిసారి మార్నింగ్ టీ తాగుతున్నా. జీవించే హక్కుకు గ్యారంటీగా ఇండియన్లు అదరికీ రాజ్యాంగం స్వేచ్ఛా హక్కును కల్పించింది. ఇతరులతో కలిసి బహిరంగంగా స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు మనకు దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు” అని పేర్కొన్నారు.