ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సిట్. యూఏఈ, థాయిలాండ్ లలో ఉన్న ఎనిమిది మంది నిందితులను గుర్తించారు సిట్ అధికారులు. నిందితులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, బొల్లారం శివకుమార్‌, ముప్పడి అనిరుధ్‌రెడ్డి, సైమన్‌ ప్రసన్‌, చంద్రపతి ప్రద్యుమ్న, పురుషోత్తం వరుణ్ కుమార్, ముప్పిడి అవినాష్ రెడ్డిలను ఎక్స్ ట్రాడిషన్, డిపోర్టేషన్ ద్వారా ఇండియాకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.  ఈమేరకు అవసరమైన మద్దతు కోసం విదేశాంగ శాఖకు లేఖ పంపింది సిట్. యూఏఈ, థాయిలాండ్ లతో ఇండియాకు ఉన్న మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ లో భాగంగా వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది సిట్.

ఈ కేసులో సాక్ష్యాల సేకరణ, లిక్కర్ స్కాం ద్వారా కొల్లగొట్టిన సొమ్ముతో విదేశాల్లో కూడబెట్టిన అక్రమాస్తులు, పెట్టుబడులను గుర్తించి, వాటిని అటాచ్ చేసేందుకు వీలుగా ఆయా దేశాల న్యాయస్థానాలకు లేఖలు పంపాలని విదేశాంగ శాఖను కోరింది సిట్. లిక్కర్ స్కాం కేసులో నిందితులు ఆయా దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో ఇప్పటికే సమాచారం సేకరించిన సిట్ ఆ వివరాలను విదేశాంగ శాఖకు పంపింది.

ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని ఏపీ సీఐడీ 2015లో మారిషస్ నుంచి ఎక్స్ ట్రాడిషన్ ప్రాసెస్ ద్వారా  ఇండియాకు రప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లిక్కర్ స్కాం కేసు నిందితులను కూడా అదే తరహాలో ఇండియాకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సిట్ అధికారులు.

ఇదిలా ఉండగా ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదివారం ( జులై 20 ) ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఈ కేసుకు సంబంధించి శనివారం ( జులై 19 ) విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఆదివారం వైద్య పరీక్షల అనంతరం మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు.