ఢిల్లీలో పరిస్థితి అదుపులోనే ఉంది

ఢిల్లీలో పరిస్థితి అదుపులోనే ఉంది
  • ఢిల్లీ అంతటా సెక్యూరిటీ కట్టుదిట్టం
  • కొన్నిచోట్ల తెరుచుకున్న షాపులు
  • అల్లర్ల ప్రాంతాల్లో కేజ్రీవాల్, దోవల్ పర్యటన
  • అంతా కంట్రోల్​లోనే ఉందని ప్రకటన
  • అమిత్ షా రాజీనామా చేయాలి: సోనియా డిమాండ్
  • మృతుల సంఖ్య27.. 200 మందికి పైగా గాయాలు

నార్త్​ ఈస్ట్​ ఢిల్లీలో పరిస్థితి కంట్రోల్​లో ఉందని నేషనల్​ సెక్యూరిటీ అడ్వైజర్(ఎన్ఎస్ఏ)​ అజిత్  దోవల్​ బుధవారం చెప్పారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఆయన పర్యటించి, అక్కడి పరిస్థితిని అంచనా వేశారు. స్థానికులతో మాట్లాడి, భయపడాల్సిన పనిలేదని వారికి ధైర్యం చెప్పారు. కొంతమంది క్రిమినల్స్ వల్లే అల్లర్లు జరిగాయి తప్ప ప్రజల మధ్య ఎలాంటి ద్వేషంలేదని అన్నారు. అల్లర్ల నేపథ్యంలో ఆ నేరస్థులను ప్రజలు దూరంపెడుతున్నారని వివరించారు. హింసాత్మక అల్లర్లను అణిచివేసి, శాంతి నెలకొల్పడంలో పోలీసులు శక్తివంచన లేకుండా కృషిచేశారన్నారు. నార్త్​ ఈస్ట్​ ఢిల్లీలో పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా డ్యూటీ చేస్తున్నారని తెలిపారు. మంగళవారం కొన్ని సంఘటనలు జరిగినా.. బుధవారం అంతటా శాంతి నెలకొందన్నారు. దేశ రాజధానిలో అల్లర్ల నేపథ్యంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్​ షాల ఆదేశాలతో దోవల్​ఈ పర్యటన చేశారు. 24 గంటల వ్యవధిలో ఢిల్లీ వీధుల్లో రెండుసార్లు టూర్​ చేశారు. పోలీసులతో కలిసి జఫ్రాబాద్​ ఏరియాలో దోవల్​ పర్యటించారు. ఇక్కడ తమకు సేఫ్టీ లేదని స్థానిక యువతి ఒకరు ఆయన ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారులు రెచ్చిపోతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో ఆ యువతికి దోవల్​ ధైర్యం చెప్పారు. ఇక్కడున్న వాళ్లందరూ సేఫ్​గానే ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. తర్వాత ఆ యువతి సేఫ్​గా ఇంటికెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన తర్వాత దోవల్​ హోంమంత్రి అమిత్​ షాను కలిసి పరిస్థితిని వివరించారు. సాధారణ పరిస్థితిని నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారని హోంశాఖ వర్గాలు తెలిపాయి. దోవల్​ తో పాటు హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా, ఐబీ డైరెక్టర్​ అర్వింద్, ఢిల్లీ పోలీస్​ కమిషనర్​ పట్నాయక్​ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అల్లర్లపై 18 ఎఫ్​ఐఆర్​లు

ఈశాన్య ఢిల్లీ ప్రశాంతంగా ఉందని డిప్యూటీ పోలీస్​ కమిషనర్​ (సౌత్​ఈస్ట్​) మన్​దీప్​ రంధావా చెప్పారు.  ఈనెల 23 నుంచి అట్టుడికిన నార్త్​ఈస్ట్​ ఢిల్లీలో బుధవారం ఒక్క అవాంఛనీయ సంఘటనా జరగలేదని మీడియాకు తెలిపారు.  అల్లర్లకు సంబంధించి 18 ఎఫ్​ఐఆర్​లు నమోదుచేసినట్టు చెప్పారు.   చాంద్​బాగ్​, మౌజ్​పూర్, జఫ్రాబాద్​లాంటి ప్రాంతాల్లో 106 మందిని అరెస్టు చేశామన్నారు. అల్లర్లలో గాయపడ్డవారు గురు తేజ్‌ బహదుర్​ హస్పిటల్​, ఎల్​ఎన్​జేపీ హాస్పిటల్​, రామ్​మనోహర్​లోహియా హాస్పిటల్​, ఇతర హెల్త్​కేర్​ సెంటర్లలో ట్రీట్​మెంట్
​తీసుకుంటున్నారు.

సెక్యూరిటీ సిబ్బంది ఫ్లాగ్​ మార్చ్

ఢిల్లీలో అల్లర్లు జరిగిన  చాంద్​ బాగ్​, జఫ్రాబాద్​, భజన్​పురా, యమునా విహార్​, మౌజ్​పూర్​లో   సెక్యూరిటీ ఫోర్స్​ బుధవారం ఫ్లాగ్​ మార్చ్​ జరిపింది.  ఈ ఏరియాల్లోని  షాపులు, స్కూళ్లు మూతపడ్డాయి.  వీధుల్లో జనసంచారం లేదు.  చాంద్​బాగ్​లో పెద్ద ఎత్తున ఫోర్స్​ను దింపారు.ఈ ఏరియాలో రోడ్లమీదకు రావడానికి  జనాన్ని   అనుమతించడంలేదు.   సెక్యూరిటీ కోసం కొన్ని దారుల్ని తామే మూసేశామని స్థానికులు చెప్పారు.