
హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీ అది.. ఒకే ఒక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఉంది.. అది కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని అనౌన్స్ చేసింది. ఏదో 20,30 మంది వస్తారని అంచనా వేసింది కంపెనీ.. వారి అంచనాలు తలకిందులు అయ్యాయి.. ఏకంగా 300 మందికి పైగా అభ్యర్థులు తరలి వచ్చారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ కాస్తా.. జాతరను తలపించింది. దేశంలో.. హైదరాబాద్ లో నిరుద్యోగ సమస్య ఎలా ఉంది.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంతలా ఎదురు చూస్తున్నారు అనటానికి ఇదే సాక్ష్యం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ లో నిరుద్యోగ సమస్య ఎంతగా ఉందో చెప్పడానికి ఈ సీన్ ప్రత్యక్ష సాక్ష్యం..నిరుద్యోగులు గుంపులు గుంపులుగా ఉద్యోగ దరఖాస్తుకు పోటీ పడుతున్న సీన్.. నిరుద్యోగ తీవ్రతను స్పష్టం చేస్తుంది. అయితే ఈ వీడియో ను చూసిన నెటిజన్లు.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇండియాలో నిరుద్యోగ సమస్య, ఇటీవల కాలంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు, ఉద్యోగుల పని గంటలపై ఈ వీడియో నెటిజన్లలో చర్చకు దారి తీసింది. కొందరు నిరుద్యోగంపై ఆందోళన వ్యక్తం చేయగా.. కొందరు పరిష్కార మార్గాలను సూచించారు.
AI క్లౌడ్ పూర్తిగా ఐటీ పరిశ్రమకు అంతరాయం కలిగించిందని.. ఐటీ రంగంలో స్వర్ణయుగం ముగిసినట్టే అని.. ఏడాదికి 15 లక్షల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారని.. వీరంతా తప్పనిసరిగా సొంత స్టార్టప్ లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించాలని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. గ్రీన్, ఆటో సెక్టార్ ఇలా మొదలైన అంశాల్లో స్టార్టప్ లు ఏర్పాటు చేసుకుంటే మేలు అని సూచిస్తున్నారు.
మరో నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. ఐటీ హబ్ తో హైదరాబాద్ నగరంలో ఐటీ రంగంలో 40 శాతం ఉపాధిని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని.. యువత స్కిల్స్ ను పెంచుకొని ఉద్యోగ అవకాశాలను పొందాలని సూచించారు.
ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. ఐటీ కంపెనీల్లో ఉద్యోగం కోసం చూసేవారిలో 90 శాతం మంది బీకామ్., బీఏ వంటి విద్యార్హతలు కలిగివున్నారని.. స్కిల్స్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగం పొందుతారు అని చెప్పుకొచ్చారు.
మరొక నెటిజన్ ఇలా స్పందించారు. కంపెనీ మేనేజ్మెంట్లు వారానికి 70 గంటలు పనిచేయాలని కోరుకుంటారు. మన దగ్గర చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. వారిలో ఒక ఉద్యోగానికి ఇద్దరిని నియమించుకుని వారిచేత వారానికి 40 గంటల చొప్పున పని ఎందుకు ఇవ్వకూడదు అని అని సలహా ఇచ్చారు.
మరికొందరు నెటిజన్లు దేశంలో నిరుద్యోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సాధ్యమైనంత వరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.
Situation of walk-in interviews in India. This is in Hyderabad. pic.twitter.com/DRyz4R4YgM
— Indian Tech & Infra (@IndianTechGuide) November 1, 2023