Madharaasi OTT Release: OTTలోకి 'మదరాసి' మూవీ.. నెల రోజులకు ముందే స్ట్రీమింగ్.. ఎక్కడ ఎంట్రీ ఇచ్చిందంటే?

Madharaasi OTT Release: OTTలోకి 'మదరాసి' మూవీ.. నెల రోజులకు ముందే  స్ట్రీమింగ్.. ఎక్కడ ఎంట్రీ ఇచ్చిందంటే?

తమిళ నటుడు శివకార్తికేయన్ , రుక్మిణి వసంత్ జంటగా నటించిన చిత్రం 'మదరాసి'.  భారీ అంచనాల మధ్య  సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది.  బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో  వసూళ్లు రాబట్టలేకపోయింది.  భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, అనుకున్న ఫలితం రాకపోవడంతో సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. అయితే, థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా కాకుండానే, 'మదరాసి' ఇప్పుడు ఓటీటీ వేదికగా మళ్లీ తన మాయాజాలాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

OTTలోకి 'మదరాసి' అరంగేట్రం

అక్టోబర్ 1వ తేదీన 'మదరాసి' చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.  ఇది తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు శివకార్తికేయన్ స్వయంగా ఒక ఆసక్తికరమైన వీడియో ద్వారా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు. "మీ అందరినీ మా మదరాసితో పిచ్చి రైడ్‌కు సిద్ధం చేయండి. #MadharaasiOnPrime, అక్టోబర్ 1," అని ప్రైమ్ వీడియో తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది.

 

నిరాశపరిచిన కలెక్షన్లు

సినీ ట్రెడ్ వర్గాల ప్రకారం 'మదరాసి' సినిమాను సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం. కానీ, ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి బడ్జెట్ మార్కును కూడా అందుకోలేకపోయింది. సినిమా బాక్సాఫీస్ ప్రదర్శనను పరిశీలిస్తే... సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం 18 రోజుల్లో భారతదేశంలో రూ. 61.86 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దీని మొత్తం వసూళ్లు రూ. 97.69 కోట్లుగా ఉన్నాయి. విదేశాలలో ఈ తమిళ చిత్రం రూ. 25 కోట్లు రాబట్టింది. అద్భుతమైన నటీనటులు, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, సినిమా వంద కోట్ల క్లబ్‌ను కూడా చేరుకోకపోవడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

తారాగణం.. 

భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్. శ్రీ లక్ష్మీ మూవీస్ పతాకంపై ఎన్. శ్రీలక్ష్మి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుదీప్ ఎలామోన్ సినిమాటోగ్రఫీ అందించారు. 168 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో శివకార్తికేయన్ రఘురామ్ పాత్రలో, రుక్మిణి వసంత్ మాలతిగా నటించారు. వీరితో పాటు విద్యాత్ జమ్వాల్ (విరాట్), బిజు మీనన్ (ప్రేమ్‌నాథ్), విక్రాంత్ (సందీప్), షబీర్ కల్లరక్కల్ (చిరాగ్) వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఒక విషాదకరమైన గతం ఉన్న వ్యక్తి, ఆయుధాల పంపిణీని ఆపే ఆపరేషన్‌లో ఎలా భాగమయ్యాడనే కథాంశంతో 'మదరాసి' రూపొందించబడింది. థియేటర్లలో సరిగా ఆడకపోయినా, ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.