దళితుల భూమి సర్కారు కబ్జా

దళితుల భూమి సర్కారు కబ్జా
  • దళితుల భూమి సర్కారు కబ్జా! 
  • పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణానికి కేటాయింపు 
  • మంచిర్యాల జిల్లా కొర్విచెల్మలో లబ్ధిదారుల ఆందోళన 
  • వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన
  • వెనుదిరిగిన అధికారులు  

దండేపల్లి, వెలుగు:  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మలో దళితులకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన ఆరు ఎకరాల భూమిని ప్రభుత్వం కబ్జా చేస్తోంది. అందులో పల్లె ప్రకృతివనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ట్రాక్టర్​తో చదును చేస్తుండగా దళితులు అడ్డుకున్నారు. నలభై ఏండ్ల కిందట ఇచ్చిన తమ భూములు లాక్కొంటే ఊరుకునేది లేదని ఆందోళనకు దిగారు. సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. 1982లో ఆనాటి ప్రభుత్వం 70 మంది పేద దళితులకు 169 సర్వే నంబర్లో ఆరు ఎకరాల భూమిని ఇండ్లు నిర్మించుకోవడానికి పంపిణీ చేసింది. ఊరికి దూరంగా ఉండడం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఇండ్లు కట్టుకోలేదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఊరిలో పల్లె ప్రకృతివనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

దీంతో మండల అధికారులు దళితులకు ఇచ్చిన భూమిని క్రీడా ప్రాంగణానికి కేటాయించారు. ఉపాధిహామీ అధికారులు భూమిని చదును చేస్తుండగా దళిత మహిళలు అడ్డుకున్నారు. తమకు పంపిణీ చేసిన భూమిని తిరిగి లాక్కోవడం సరికాదని ఆందోళన కు దిగారు. తహసీల్దార్ హనుమంతరావు, ఎంపీడీఓ మల్లేశం, ఎస్సై సాంబమూర్తి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా కొందరు యువకులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని వాటర్ ట్యాంక్ ఎక్కారు. తమ భూములు తీసుకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని, ట్యాంక్ పై నుంచి దూకి చస్తామని హెచ్చరించారు.

దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. చివరకు అధికారులు.. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని వెళ్లిపోవడంతో ఆందోళన విరమించారు. ఇచ్చిన గడువులోగా దళితులు ఇండ్లు కట్టుకోనందునే భూమిని  ఇతర అవసరాలకు కేటాయించాల్సి వచ్చిందని తహసీల్దార్ హనుమంతరావు తెలిపారు.