రాయదుర్గంలో ఆరుగురు బైక్​ రేసర్లు అరెస్ట్

రాయదుర్గంలో ఆరుగురు బైక్​ రేసర్లు అరెస్ట్
  •     పరారీలో మరో నలుగురు యువకులు
  •      రాయదుర్గంలో 10 బైకులు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు : అర్ధరాత్రి ఐటీ కారిడార్ రోడ్లపై బైక్ రేసింగ్​లతో బెంబేలెత్తిస్తున్న ఆరుగురిని రాయదుర్గం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరో నలుగురు బైక్ రేసర్లు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల16న అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఐటీ కారిడార్ లోని టి–హబ్, నాలెడ్జ్ సిటీ, సత్వ బిల్డింగ్ రోడ్లలో బైక్​ రేసింగ్​జరుగుతుందన్న సమాచారంతో రాయదుర్గం పోలీసులు అక్కడికి వెళ్లారు.

పోలీసుల రాకను చూసిన రేసర్లు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అన్నీ రోడ్లను బారికేడ్లతో క్లోజ్ చేశారు. దీంతో రేసర్లు తమ బైకులను అక్కడే వదిలేసి పారిపోయారు. 10 బైకులను స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం అబ్దుల్ మతిన్, సాయికిరణ్, శరణ్, భానుచందర్, ఈశ్వర్​కుమార్, కృష్ణ అనే ఆరుగురిని అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించారు. మరో నలుగురు రేసర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.