అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురు అరెస్ట్

అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: ఒడిశా నుంచి మహారాష్ట్రకు సిటీ మీదుగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురిని బాలానగర్ ఎస్ వోటీ, శామీర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జీడిమెట్లలోని బాలానగర్ డీసీపీ ఆఫీసులో డీసీపీ సందీప్  కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకి చెందిన రవిధన్ సింగ్ చౌహన్(37), కిరణ్​రామ్ పవార్(35), వికాస్ మన్ సింగ్ చౌహాన్(43), అదేశ్ శాంత్ కుమార్ జాదవ్(22), కిషన్ చౌహాన్(36), ఒడిశాకు చెందిన నర్సింగ్ మాడీ(32) వీరంతా గ్యాంగ్ గా ఏర్పడి ఈజీ మనీ కోసం గంజాయి సప్లయ్ చేస్తున్నారు. నర్సింగ్ ఒడిశాలోని షేర్ పల్లి ఏజెన్సీలో గంజాయి పండించే వారిని నుంచి దాన్ని సేకరించేవాడు. తర్వాత గంజాయిని ఒడిశా నుంచి సిటీ మీదుగా మహారాష్ట్రలోని సోలాపూర్ కు రవిధన్ గ్యాంగ్ తరలించేది. ఇటీవల రవిధన్ సింగ్ ఒడిశాకు వెళ్లి నర్సింగ్ మాడీని కలిసి 800 కిలోల గంజాయి కావాలని చెప్పి కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇచ్చాడు. కానీ నర్సింగ్ 350 కిలోల గంజాయిని మాత్రమే సమకూర్చాడు.  ఆ గంజాయి ప్యాకెట్లను తీసుకున్న రవిధన్ సింగ్ గ్యాంగ్, నర్సింగ్ తో కలిసి రెండు కార్లలో ఒడిశా నుంచి సిటీ మీదుగా సోలాపూర్​కు బయలుదేరింది. దీని గురించి సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ వోటీ పోలీసులు  సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. శామీర్ పేట పరిధిలోని ఓఆర్ఆర్ వద్ద కార్లను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు రవిధన్ తో పాటు అతడి గ్యాంగ్ కు చెందిన నలుగురు, నర్సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.  రూ. 80 లక్షల విలువైన 350 కిలోల గంజాయి, రెండు కార్లు,  స్వాధీనం చేసుకున్నారు.