తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ!

తెలంగాణలో  ఆరు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ!
  • ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు ఎమ్మెల్సీలు.. త్వరలో ఇవి ఖాళీ

  • మళ్లీ ఒక గ్రాడ్యుయేట్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు చాన్స్

హైదరాబాద్, వెలుగు:  శాసన మండలిలో అడుగుపెట్టే అవకాశం ఆరుగురికి దక్కనుంది. గవర్నర్​ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉండగా, నలుగురు ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిని ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్​ జారీ చేయడంతో వారం రోజుల్లోగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. గవర్నర్​ కోటాలో కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్​ పేర్లను కేసీఆర్ ​ప్రభుత్వం సిఫార్సు చేసి గవర్నర్​ ఆమోదం కోసం పంపినా.. ఆ ప్రతిపాదన పక్కకు వెళ్లింది. ఈలోపే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ రావడంతో ఆ రెండు సీట్లు ఖాళీగానే ఉన్నాయి. 

గవర్నర్ ​కోటాలో ఖాళీగా ఉన్న ఈ 2సీట్లు కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ​ప్రభుత్వం సిఫార్సు చేసే వాళ్లు దక్కించుకోనున్నారు. మిగతా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్​కు ఇప్పటికిప్పుడు ఒక్క సీటు దక్కనుంది. ఒకటి బీఆర్ఎస్​ఖాతాలో చేరనుండగా మిగతా 2సీట్లకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎమ్మెల్యేలుగా గెలిచి రాజీనామా..

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి స్టేషన్​ఘన్​పూర్ ​నుంచి, పాడి కౌశిక్​ రెడ్డి హుజూరాబాద్ ​నుంచి గెలిచారు. మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి విజయం సాధించారు. ఇదే జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుళ్ల దామోదర్​రెడ్డి కొడుకు రాజేశ్​రెడ్డి నాగర్​కర్నూల్​ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ ​ప్రభుత్వం రావడంతో కూచుకుళ్ల ఎమ్మెల్సీ పదవికి ఢోకా లేదు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్​ నియోజకవర్గం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కడియం, కౌశిక్, కసిరెడ్డి, పల్లా మరో ఐదు రోజుల్లోపే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. గవర్నర్ ​కోటాలో ఖాళీగా ఉన్న స్థానాలకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించే కేబినెట్​భేటీలో ఇద్దరు పేర్లు ఎంపిక చేసి గవర్నర్ ​ఆమోదం కోసం పంపనున్నారు. పల్లా ఖాళీ చేసే గ్రాడ్యుయేట్స్, కసిరెడ్డి ఖాళీ చేసే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవులకు నోటిఫికేషన్ ​జారీ చేసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతుండగా అసెంబ్లీలో సంఖ్యా బలం దృష్ట్యా ఒక సీటు కాంగ్రెస్ కు, రెండో సీటు బీఆర్ఎస్​కు దక్కనుంది. ఒకవేళ కాంగ్రెస్​ ఇద్దరు అభ్యర్థులను పోటీకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది.

ఎవరికి అవకాశం?

కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​తో కలిసి టీజేఎస్​ చీఫ్ ప్రొఫెసర్ ​కోదండరామ్, కమ్యూనిస్టులు, జాగో తెలంగాణ పేరుతో రిటైర్డ్​ ఐఏఎస్​ఆకునూరి మురళీ, తీన్మార్​ మల్లన్న సహా పలు ప్రజా సంఘాల నాయకులు పోరాటం చేశారు. సీపీఐ, టీజేఎస్​తో కాంగ్రెస్ ​పార్టీ ఎన్నికల్లో అవగాహన కుదుర్చుకుంది. సీపీఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని మాట ఇచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నర్​కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి ఇవ్వొచ్చనే చర్చ మొదలైంది. ప్రొఫెసర్ ​కోదండరామ్​కు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. రిటైర్డ్ ​ఐఏఎస్ ​ఆకునూరి మురళీకి గవర్నర్​కోటాలో ఎమ్మెల్సీగా చాన్స్​దక్కొచ్చని ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్​అలీ, ఫిరోజ్​ఖాన్ లో ఒకరికి ఇప్పుడు.. మరొకరికి తర్వాత ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. గ్రేటర్ ​హైదరాబాద్​లో కాంగ్రెస్ ​ఖాతా తెరువ లేదు.. ఈ నేపథ్యంలో మధుయాష్కీ గౌడ్, మైనంపల్లి హన్మంత రావు, అంజన్​కుమార్ ​యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సీనియర్ ​నేత జానారెడ్డికి ఎమ్మెల్సీగా చాన్స్ ​ఇవ్వొచ్చని తెలుస్తున్నది.

2025 మార్చి వరకు మళ్లీ ఖాళీలు లేవు 

నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ ​రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన తీన్మార్ ​మల్లన్నకు కాంగ్రెస్ ​టికెట్ఇవ్వడం ఖాయమని చెప్తున్నారు. కాంగ్రెస్​లో చేరిన తీన్మార్ ​మల్లన్న 18 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అన్ని చోట్ల కాంగ్రెస్​ గెలిచింది. దీంతో అవసరమైతే మల్లన్నకు ఎమ్మెల్యే కోటాలో కూడా చాన్స్​ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతున్నది. సీపీఐకి ఇచ్చే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటు గవర్నర్ ​కోటాలో కోరుతున్నారు. ఈ ఆరు సీట్లు తప్ప కౌన్సిల్​లో 2025 మార్చిలోపు ఖాళీ అయ్యే సీట్లు లేవు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీట్ల కోసం పట్టుబడుతున్న నేతలందరినీ సంతృప్తి పరచాల్సి ఉంది. కాంగ్రెస్​కు అండగా నిలిచిన మేధావులు, ప్రజా సంఘాల లీడర్లను ఇతరత్రా సర్దుబాటు చేయాల్సి ఉంది.