హైదరాబాద్, వెలుగు: -సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రయాణించే వందేభారత్ ట్రైన్-పై ఇటీవల రాళ్ల దాడి చేసినవారిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం10 మందిని అరెస్ట్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిందితుల్లో ఆరుగురు 17 ఏండ్ల వయస్సు వారేనని రైల్వే ఆఫీసర్లు తెలిపారు. అలాగే, జోన్ పరిధిలో వివిధ రైళ్లపై దాడి చేసిన 39 మందిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వివిధ రైళ్లపై 9 సార్లు దాడులు జరిగినట్లు చెప్పారు. దాడుల్లో ఐదుగురు ప్యాసింజర్లకు గాయాలయ్యాయన్నారు.
