- వైరా వద్ద స్కూటీని ఢీకొట్టినబొగ్గు లారీ.. దంపతుల దుర్మరణం
- ఖమ్మం టౌన్లో బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకుల మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
- ఆకుపాములలో ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ .. ఇద్దరు మహిళా కూలీలు మృతి
వైరా/మునగాల/ ముదిగొండ, వెలుగు: సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. శుక్రవారం రాత్రి బైక్ అదుపుతప్పిన ఘటనలో ఇద్దరు యువకులు మరణించగా.. శనివారం జరిగిన ప్రమాదాల్లో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు నవ దంపతులు, ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ కు చెందిన రంగన సుబ్బారెడ్డి(45) వనం రోజా(34) దంపతులు కిరాణం షాపు నడుపుకుంటున్నారు. వారం కిందటే సుబ్బారెడ్డి తన భార్యతో కలిసి అత్తగారి ఊరైన ఖమ్మం జిల్లా సత్తుపల్లికి వచ్చాడు. శనివారం తన స్కూటీపై భార్య రోజాను ఎక్కించుకొని బయలుదేరాడు. వైరా రింగ్ రోడ్ వద్దకు చేరుకోగానే తల్లాడ వైపు నుంచి వేగంగా వచ్చిన బొగ్గు లారీ స్కూటీని ఢీకొట్టింది. దీంతో సుబ్బారెడ్డి దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. సుబ్బారెడ్డి, రోజాలకు ఐదు నెలల క్రితమే పెళ్లయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద..
నడిగూడెం మండలం రామాపురానికి చెందిన నేలమర్రి వినోద, తుమ్మల ధనమ్మ తో పాటు మరో ఇద్దరు జీఎంఆర్ సంస్థ కాంట్రాక్టర్ వద్ద కూలీలుగా పనిచేస్తున్నారు.శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి మధ్యలో ఉన్న మొక్కలను వారు కట్ చేశారు. అనంతరం వాటిని ట్రాక్టర్ లో వేస్తుండగా.. సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న లారీ, ట్రాక్టర్ ను ఢీకొట్టింది. నేలమర్రి వినోద (30) అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన తుమ్మల ధనమ్మ(55) ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తీవ్రంగా గాయపడిన మరో మహిళ రోశమ్మ పరిస్థితి సీరియస్ గా ఉందని ఎస్సై లోకేశ్ తెలిపారు.
చావులోనూ వీడని స్నేహం..
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన పోలగాని రవీందర్ (23), పోతూనుక శివ (23) ఖమ్మంకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో మరో స్నేహితుడు ఉదయ్ కుమార్ (21) కలిశాడు. దీంతో ముగ్గురు కలిసి బైక్పై బయలుదేరారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలోని చర్చి కాంపౌండ్ రైల్వే బ్రిడ్జి వద్దకు వారు చేరుకోగానే.. ఏదో శబ్దం వినిపించగా డ్రైవ్ చేస్తున్న రవీందర్ వెనక్కి తిరగడంతో బైక్ అదుపుతప్పి ఫుట్పాత్ ను ఢీకొట్టింది. బైక్ కిందపడి 30 మీటర్ల వరకు వారిని లాక్కెళ్లింది. ఈ ఘటనలో పోతూనుక శివ, ఉదయ్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. రవీందర్ తలకు గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు యువకులూ ఖమ్మంలోనే డిగ్రీ సెకండియర్ చదువుతున్నారు. ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మేడేపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.