V6 News

ఆధ్యాత్మికం: ఈ ఆరు గుణాలు ఉన్నవాళ్లు జీవితంలో బాగుపడినట్లు చరిత్రలో లేదు !

ఆధ్యాత్మికం: ఈ ఆరు గుణాలు ఉన్నవాళ్లు జీవితంలో బాగుపడినట్లు చరిత్రలో లేదు !

శత్రువులు బయట ఎక్కడో కాదు, మన లోపలే ఉంటారు. వారిని గుర్తించి, జయించగలిగితే మంచి మార్గంలో నడుచుకోవచ్చు. పేరు ప్రఖ్యాతులు సంపాదించు కోవచ్చు. అందుకోసం పెద్దగా చెయ్యాల్సింది ఏమీ లేదు. ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాం.. ఎందుకు చేస్తున్నాం.. అందుకు కారణాలేంటి? అని తరచి చూసుకుంటే సరిపోతుంది.

మనసు లాగేవి..  ఆరు గుణాలే.  వాటినే  అరిషడ్వర్గాలు అంటారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదమాత్సర్యాలు. ఇవి మనిషిని ఎంత స్థాయికైనా దిగజారుస్తాయి. నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తాయి. దుఃఖాన్ని కలిగిస్తాయి. వీటిని అదుపులో పెట్టుకుంటే చాలు. ఏ పనిలో అయినా విజయం సాధించొచ్చు. అందరిలో పేరు తెచ్చుకోవచ్చు. గొప్ప స్థాయికి ఎదగొచ్చు.

  • మితిమీరి కోరుకుంటే...

'కామం' అంటే కేవలం శారీరక వాంఛ మాత్రమే కాదు. మానసికమైనవి కూడా ఏదైనా అనుభవించాలనే తపన ఉన్నంతలో తృప్తి పడకుండా చాలామంది ఇది కావాలి. అది కావాలి, ఇంకా కావాలి' అని అలోచిస్తుంటారు. మితిమీరినవి. స్థాయికి మించినవి కోరుకుంటారు. అవసరాలకు మించి తాపత్రయ పడుతుంటారు. చివరకు ఆ కోరికల వల్ల బాధలు పడతారు. ప్రాణాలు కూడా కోల్పోతారు. మహాభారతంలో కీచకుడు ద్రౌపదిని కోరుకుంటాడు. అహంకారంతో ఎంత చెప్పినా వినడు. చివరకు భీముడి చేతిలో అతడు, అతడి తమ్ముళ్ళు చనిపోతారు. అందుకే ధర్మబద్ధమైన విలువలతో. న్యాయంతో ఉన్న కోరికలు కోరుకోవడంలో తప్పులేదు. మితిమీరిన ఆశలకు పోతే తిప్పులు తప్పవు. అందుకే ఆధ్యాత్మిక గ్రంథాలు కోరికలను ధర్మబద్ధంగా తీర్చుకోవాలని చెప్పాయి

  • ఆవేశం తెచ్చే నష్టం

క్రోధం అంటే కోసం కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే మనిషిని సర్వనాశనం చేస్తుంది. మనిషిని దిగజారుస్తుంది. తన మాట చెల్లడం లేదని ఎవరూ వినడం లేదని తను అనుకున్న పనులు కావడం లేదని మరొకరి మీద కోపం, పగ పెంచుకుంటే తిప్పలు తప్పవు. కోపం వల్ల బుద్ధి చెడిపోతుంది. ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన నశిస్తుంది. అందువల్ల కోపంలో తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండవు. ఆవేశంలో చేసేపనుల వల్ల ఇబ్బందులు, నష్టాలు తప్పవు. హిరణ్యకశిపుడు విష్ణువు మీద ఉన్న కోపంతో, కొడుకు ప్రహ్లాదుడిని కష్టాలకు గురిచేస్తాడు. తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. కోపం శత్రువులను పెంచుతుంది. బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నా ఒంటరిని చేస్తుంది. తనకోపం తనతశ్రువు అన్నది అందుకే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పనికైనా సక్రమంగా చెయ్యాలన్నా. ఇతరులతో కలిసి బతకాలన్నా కోపం తగ్గించుకోవాలి.

  • వ్యామోహం తెచ్చే తిప్పలు

'మోహం' అంటే మితిమీరిన కోరికలు ఉండటం. వస్తువులు, మనుషుల మీద ఎక్కువ వ్యామోహం పెంచుకో వదం. ఇలా పెంచుకోవడం వల్ల ఆ వస్తువులు లేదా మనుషులు దూరమైనప్పుడు తట్టుకోలేరు. ఇలాంటి వాళ్లు తమకు దక్కాల్సింది ఇతరులకు దక్కినా తట్టుకోలేరు. మానసికంగా కుంగిపోతారు. దశరథుడికి కైకేయిపై ఉన్న మోహంతో ఆమె చెప్పిన మాటలను కాదనలేక పోతాడు. దాంతో రాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేయాల్సి వస్తుంది. మోహంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్లు చెప్తున్న మాటలోని తప్పొప్పులు గురించి ఆలోచించలేరు. అదే తర్వాత కష్టాలకు కారణం  అవుతుంది. శరీరానికి సంబంధించిన సుఖాలు.. సంతోషాలపై ఎక్కువ మోహం పెంచుకోవడం వల్ల కష్టాలు తప్ప, సంతోషాలు ఉండవు

  • ఏం లాభం? అనుకుంటే

''లోభం' అంటే పిసినారి తనం. అంతా తనకే కావాలనే ఆశతో కొందరు ఆస్తులు కూడబెట్టుకుంటారు. ఎవరికీ పూచిక పుల్ల కూడా ఇవ్వరు. సంపాదించింది అంతా తమకోసమే కూడబెట్టుకుంటారు. రాజు సొమ్ము రాళ్ల పాలు అన్నట్లు, ఇలాంటి వాళ్లు కష్టపడి సంపాదించిన సొమ్మంతా చివరకు మరొకరి సొంతం అవుతుంది. లోభంతో ప్రవర్తించే వాళ్లు తినరు. మరొకరిని తిననవ్వరు. ఇలాంటి స్వభావం ఉన్న వాళ్లు పైకి ఎదగలేరు. తమ గోతిని తామే తవ్వుకుంటారు. మానవ సంబంధాలకు విలువ ఇప్పుడు ఎవరితో కలిసినా వాళ్ళ వల్ల తమకు ఎలాంటి లాభం వస్తుందో అని ముందే అంచనా వేసుకుంటారు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు తన కొడుకే రాజవ్వాలని, సంపదంతా దుర్యోదనుడికి దక్కాలని స్వార్ధంగా ఆలోచిస్తాడు. పాండవుల వైపు కపట ప్రేమ చూపిస్తాడు చివరకు కురుక్షేత్ర యుద్ధంలో కొడుకు ప్రాణాలు పోతాయి. లోభం మనిషిని కింది స్థాయికి దిగజారుస్తుంది. పరుపు, ప్రతిష్టలను నాశనం చేస్తుంది

అంతా నాకే అనుకుంటే...

మాత్సర్యం' అంటే ఈర్షతో ఆలోచించడం తనకంటే ఎవ్వరూ ముందుకు వెళ్లకూడదని ఆలోచించడం. తనకంటే ఎవరూ ఎక్కువ సంపాదించకూడదు.. ఎప్పుడూ తనకే ఫస్ట్ మార్కులు రావాలి. అందరూ తననే పొగడాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లు మరొకరు వాళ్లకంటే ముందుకెళ్తే తట్టుకోలేరు. తమకు దక్కింది మరొకరికి దక్కకూడదు అనుకుంటారు. తనకంటే ఎక్కువ సుఖం. సంతోషం అనుభవిస్తున్న వాళ్లను చూసి కుళ్లుకుకుంటారు. కుట్రపూరితంగా ప్రవరిస్తారు. ఇలాంటి స్వభావానికి శకుని సరైన ఉదాహరణ, పాండవులను ఓడించాలనే కుట్రతో ఆలోచిస్తాడు. జూదం ఆడేటప్పుడు దుర్కోదనుడితో కలిసి మాయా పాచికలతో మోసం చేస్తాడు. పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసానికి పంపుతారు. ఇలాంటి స్వభావం వల్ల మొదటికి మోసం వస్తుంది. అభివృద్ధి చెందేవాళ్లను చూసి ఓర్వలే కపోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాలుదెబ్బతింటాయి

  • అహం పనికిరాదు

'మదం' అంటే గర్వం తనరంటే ఎవరూ గొప్పవాళు లేరనుకోవడం డబ్బు, పదవి బలంతో కొందరు ఇతరులను లెక్కచెయ్యరు. తమనుతాము పొగుడుకుంటారు. అహంకారంతో ప్రవర్తిస్తుంటారు. ఇతరులను అవమానిస్తారు. తిడతారు, కోప్పడతారు. కానీ మదంతో ఉన్న వాళ్లతో ఎవరూ ఎక్కువకాలం సంబంధాలు కొనసాగించలేరు. మదమే చివరకు వాళ్ల పతనానికి కారణం అవుతుంది. రావణాసురుడు తనకంటే గొప్పవాళ్లు ఎవరూ లేరని విర్రవీగుతాడు. సీతను అవహరిస్తాడు. తమ్ముడు విభీషణుడు చెప్పినా వినడు. చివరకు రాముడి చేతిలో చనిపోతాడు. మదంతో ఉన్నవాళ్లకు లోకంలో తనకు ఎదురు లేదనుకుంటారు. అలాగే అహం మనిషిచేత ఎంతటి చెడ్డపనయినా చేయిస్తుంది. ఇలాంటి వాళ్లకు ఎవరైనా సాయం చేసినా ఆది తమ గొప్పతనం వల్లే అనుకుంటారు. ఎదుటి వాళ్ల మంచితనాన్ని గుర్తించరు. అంతా తమదే అన్నట్లు భావించుకుంటారు.