ఆటో ఎక్కిస్తారు.. డబ్బు దోచేస్తారు.. గీసుకొండలో ఆరుగురు దోపిడీ దొంగల అరెస్ట్

ఆటో ఎక్కిస్తారు.. డబ్బు దోచేస్తారు.. గీసుకొండలో ఆరుగురు దోపిడీ దొంగల అరెస్ట్

పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని, వారిని బెదిరించి డబ్బులు లాక్కొంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను వరంగల్ జిల్లా గీసుగొండ పోలీసులు అరెస్టు చేశారు. మామునూర్ ఏసీపీ వెంకటేశ్ గురువారం వివరాలు వెల్లడించారు. గత నెల 30న నర్సంపేటలో బీటెక్ చదువుతున్న వరంగల్ కరీమాబాద్‌‌కు చెందిన పెరుమాండ్ల సిద్ధార్థ తన ఫ్రెండ్ ముద్రబోయిన రాజఫణితో కలిసి మరో మిత్రుడి పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దుగ్గొండి మండలం శివాజీ నగర్ వెళ్లేందుకు కోటగండి మైసమ్మ ప్రాంతంలో ఆటో కోసం వేచి ఉన్నారు.

ఈ సమయంలో నర్సంపేట మండలం ద్వారాకాపేటకు చెందిన మార్త సాయికుమార్, బాంజీపేటకు చెందిన పెరుమాండ్ల బాలాజీ, మేకల ప్రేమంత్ కుమార్, పిట్టల సందీప్, నీలం అఖిల్, మహేశ్వరానికి చెందిన కొలుగూరి వికాస్ ఆటోలో వచ్చారు. గిర్నిబావి వద్ద దింపుతామని చెప్పి వారిని ఆటోలో ఎక్కించుకున్నారు. తర్వాత చిన్న పని ఉందని చెప్పి గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామ శ్మశాన వాటిక సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. 

విద్యార్థులను బెదిరించి సిద్ధార్థ వద్ద ఉన్న రూ.70 వేలు లాక్కొని పరారయ్యారు. సిద్ధార్థ ఫిర్యాదుతో ఈ నెల 3న కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం ఊకల్ హవేలి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో వస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆటో, ఐదు సెల్ ఫోన్లు, రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు.