ఆర్ అండ్ ​బీకి 6 వేల కోట్లు కేటాయించండి.. అధికారుల వినతి

ఆర్ అండ్ ​బీకి 6 వేల కోట్లు కేటాయించండి.. అధికారుల వినతి

ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​కు రోడ్లు, భవనాల శాఖ ప్రపోజల్స్ 

 హైదరాబాద్, వెలుగు:  త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర ఫుల్​బడ్జెట్ లో ఆర్ అండ్ బీకి రూ.6 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ అధికారులు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ను కోరారు. ఈ మేరకు ఆదివారం ప్రపోజల్స్ అందజేశారు. రోడ్ల నిర్మాణంతోపాటు బిల్డింగ్స్ కోసం నిధులు అవసరమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు, గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్ల నిర్మాణం, పలుచోట్ల హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. నిరుడు బడ్జెట్ లో ఆర్ అండ్ బీ కి రూ. 10 వేల కోట్లు కేటాయించినా ఫండ్స్ రిలీజ్ చేయలేదని తెలిపారు. దీంతో కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్​లో పడ్డాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గత పదేండ్ల నుంచి డ్యామేజ్ అయిన రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  రిపేర్​ చేయాల్సిన రోడ్లు 4 వేల  కిలో మీటర్లు ఉండగా.. వీటిని ప్రాధాన్యత క్రమంలో 3 దశలుగా డివైడ్ చేశారు. వీటి మరమ్మతులకు మొత్తం రూ.1,825 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.  తొలి దశలో రూ.884 కోట్లతో 1,823 కిలో మీటర్ల మేర రోడ్ల రిపేర్​ చేపట్టనున్నారు. 

ప్రస్తుతం వర్షాల కారణంగా సెప్టెంబర్ చివరలో వీటికి టెండర్లు పిలవనున్నట్టు ఆర్ అండ్ బీ సీఈ మోహన్ నాయక్  తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల మెడికల్ కాలేజీలు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, మూడు టిమ్స్  హాస్పిటల్స్ నిర్మాణం ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయి. వరంగల్ తోపాటు హైదరాబాద్ లో నిర్మించే టిమ్స్ లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటికి ఫండ్స్ విడుదలతోపాటు  కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను విడుదల చేయనున్నారు.