త్యాగం అంటే ఈ ఏనుగులదే…

త్యాగం అంటే ఈ ఏనుగులదే…

కళ్లెదుట మనకు కావాల్సిన వాళ్లు నీళ్లలో కొట్టుకుపోతుంటే, ప్రాణాలకు తెగించైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ క్రమంలో మన ప్రాణాలకే ముప్పు రావొచ్చు లేదంటే బయటైనా పడొచ్చు. ఈ ఏనుగులూ అంతే. ఓ చిన్న ఏనుగు నీళ్లలో పడి కొట్టుకుపోతుంటే తట్టుకోలేకపోయిన పెద్ద ఏనుగులు నీళ్లలోకి దిగాయి. కాపాడే ప్రయత్నం చేశాయి. కానీ, ఫలితం దక్కలేదు. ఆ చిన్న ఏనుగు సహా ఆరు ఏనుగులు చనిపోయాయి. ఎలాగోలా ఒడ్డుకు చేరిన రెండు ఏనుగులను అధికారులు కాపాడారు. మనసుల్ని మెలేసే ఈ ఘటన థాయిలాండ్​లోని ఖావో యై నేషనల్​ పార్క్​లో జరిగింది. పార్క్​లోని హ్యూ నరోక్​ వాటర్​ ఫాల్​(దాన్నే నరక కూపం అనీ పిలుస్తారు)లో ఏనుగు పిల్ల పడిపోయింది. దాన్ని కాపాడే ప్రయత్నంలో దానితో సహా ఆరు ఏనుగులు చనిపోయాయి. ప్రస్తుతం బతికి బయటపడిన రెండు ఏనుగులు డిప్రెషన్​లో ఉండిపోయాయని పార్క్​ రేంజర్లు చెబుతున్నారు. 1992లోనూ అదే వాటర్​ఫాల్​లో ఇలాంటి ఘటనే జరిగి 8 ఏనుగులు చనిపోయాయి.  పార్క్​లో దాదాపు 300 ఏనుగులున్నాయి. పార్క్​లోని డోంగ్​ ఫాయయిన్​ ఖావో వైని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.