అమెరికాలో టీచర్పై ఆరేళ్ల స్టూడెంట్ కాల్పులు

అమెరికాలో టీచర్పై ఆరేళ్ల స్టూడెంట్ కాల్పులు

అమెరికాలో కాల్పులకు సంబంధించిన ఘటనలు కొనసాగుతూ ఉన్నాయి. వర్జీనియాలోని రిచ్ నెక్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న ఓ ఆరేళ్ల విద్యార్థి, ఉపాధ్యాయుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆ టీచర్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. వర్జీనియాలోని న్యూపోర్ట్ సిటీలో  జరిగిన ఈ ఘటనలో మరే విద్యార్థీ గాయపడలేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా ఈ కేసులో నిందితుడైన ఆరేళ్ల బాలున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని, కస్టడీకి తరలించినట్టు  వర్జీనియా మేయర్ ఫిలిప్ జోన్స్ తెలిపారు.

అయితే విద్యార్థికి, టీచర్ కు మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ నేపథ్యంలోనే ఆ బాలుడు కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాల్పుల గురించి తమకు కాల్ వచ్చిందని న్యూపోర్ట్ పోలీస్ చీఫ్ స్టీవ్ డ్రూ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే, తమ టీం అక్కడికి చేరుకుందన్నారు. కాగా ఈ కేసుపై విచారణ జరపుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే విద్యార్థి కాల్పులు జరిపిన తుపాకీ ఎక్కడ్నుంచి వచ్చింది అన్న విషయంపై మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.ఈ ఘటన అనంతరం ఆ ఎలిమెంటరీ స్కూలుకు సెలవు ప్రకటించారు