కంబోడియా సైబర్ స్కాం గ్యాంగ్ చేతిలో కరీంనగర్ జిల్లా యువకులు

కంబోడియా సైబర్ స్కాం గ్యాంగ్ చేతిలో కరీంనగర్ జిల్లా యువకులు

కరీంనగర్ : కంబోడియా సైబర్ స్కాం గ్యాంగ్ చేతిలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు చిక్కుకున్నారు. తమను కాపాడాలంటూ తల్లిదండ్రులకు వీడియో పంపించారు. తమ కుమారులు మోసపోయారని, వారిని కాపాడాలంటూ బాధితుల తల్లిదండ్రులు.. కరీంనగర్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. 

అసలేం జరిగిందో బాధితుల కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం..
కరీంనగర్ లోని గాంధీ చౌరస్తా వద్ద ఇండో అరబ్ కన్సలెన్సీ అనే సంస్థ ఉంది. ఈ సంస్థలో కొంతమంది ఏజెంట్లుగా పని చేస్తున్నారు. ఉద్యోగాలు లేని యువకులకు ఉపాధి చూపిస్తామని చెప్పి.. వారి దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని కంబోడియాకు పంపిస్తుంటారు. ఈ క్రమంలోనే.. కంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. ఆరుగురు యువకులను ఇండో అరబ్ కన్సలెన్సీ అనే సంస్థ ఏజెన్సీకి చెందిన ఇద్దరు నిర్వాహకులు మినహాజ్ అలీ, అబ్దుల్ రహీం నమ్మించారు. దళారుల మాటలు నమ్మిన ఆరుగురు యువకులు (ఒక్కో వ్యక్తి రూ.2 లక్షలు చెల్లించి ) డబ్బులు చెల్లించారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబరు మొదటివారంలో ఆరుగురు యువకులను కంబోడియాకి పంపారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత క్రిప్టో కరెన్సీ, క్రెడిట్ కార్డు, హనీ ట్రాప్ పనులు చేయిస్తున్నారంటూ ఆరుగురు యువకులు తమ తల్లిదండ్రులకు గోడు వెళ్లబోసుకున్నారు. చెప్పిన పనులు చేయకుంటే పాసుపోర్టు ఇవ్వకుండా.. జైల్లో పెట్టిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని వివరించారు. దీంతో తమ బిడ్డలు మోసపోయారని, వారిని కాపాడాలంటూ  కరీంనగర్ సీపీని కలిసి.. గోడు వెళ్లబోసుకున్నారు బాధితుల తల్లిదండ్రులు. 

తమ కుమారులను తిరిగి ఇండియాకు పంపించాలంటే 2, 40,000 వేలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని యువకుల కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంబోడియాలో చెప్పిన మాటలు వినకున్నా, టార్గెట్ పూర్తి చేయకపోయినా కొట్టడం, కరెంటు షాక్ ఇస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఎలాగైనా తమ కుమారులను తిరిగి ఇండియాకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.