బెంగాల్‌లో కొనసాగుతున్న ఆరోవిడత పోలింగ్

బెంగాల్‌లో కొనసాగుతున్న ఆరోవిడత పోలింగ్

బెంగాల్‌లో ఎనిమిది విడతల పోలింగ్‌లో భాగంగా నేడు ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. నాలుగు జిల్లాల్లోని 43 నియోజకవర్గాలకు ఆరో విడతలో పోలింగ్ జరుగుతోంది. నార్త్ 24 పరగణ జిల్లాలోని 17 నియోజకవర్గాలు, నదియా, ఉత్తర దినాజ్ పూర్ జిల్లాల్లోని 18 నియోజకవర్గాలు, పూర్వ వర్దమాన్ జిల్లాలోని 8 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన ఫస్ట్ లీడర్ ముకుల్ రాయ్ సహా ముగ్గురు మంత్రులు, ముగ్గురు సినీ నటులు పోటీలో ఉన్నారు. 

ఐదు,ఆరు విడతల్లో జరిగిన ఘర్షణలు దృష్టిలో ఉంచుకున్న ఎలక్షన్ కమిషన్...ఈ విడతలో 779 కంపెనీలను మోహరించింది. ఒక్క బరాక్ పోర్‌లో 107 కంపెనీలను పెట్టింది. మొత్తం 8 విడతల్లో పోలింగ్ జరుగుతుండగా... ఇప్పటివరకూ ఐదు విడతలు పూర్తయ్యాయి. కరోనా కారణంగా మిగతా నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించాలన్న టీఎంసీ, కాంగ్రెస్ విజ్ఞప్తిని ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. ఒకే విడతలో పోలింగ్ సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఏప్రిల్ 26న ఏడు, ఏప్రిల్ 29న ఎనిమిదో విడత పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న 43 నియోజకవర్గాలకు సంబంధించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో బీజేపీకి పది శాతం ఓట్లు రాగా...2019 లోక్‌సభ ఎన్నికల్లో అది 41 శాతానికి పెరిగింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 43 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ 32 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. 

ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా కూడా పార్టీల ప్రచారం మాత్రం ఆగట్లేదు. కేంద్రమంత్రి అమిత్ షా గురువారం మూడు సభల్లో పాల్గొననున్నారు. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ నాలుగు రోడ్ షో ల్లో పాల్గొంటారు. కోల్‌కతాలో సువేందు అధికారి మూడు రోడ్ షో ల్లో పాల్గొంటారు. ఇక సీఎం మమతా బెనర్జీ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారు. కరోనా కారణంగా సీపీఎం, కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.