
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.స్కిల్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు అనంతరం ఏపీ హైకోర్టు వాదనలు ముగిసినట్లు నవంబర్ 16న ప్రకటించింది
సోమవారం ( నవంబర్ 20) మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు దీనిపై తీర్పు వెలువరించింది. బెయిల్ పిటిషన్‌పై ఇటీవలే వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయావాది సిద్దార్థ లూథ్రా (Sidharth Luthra), దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు ఉండగా.. పూర్తి స్థాయి బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 15వ తేదీన వాదనలు జరిగాయి. కానీ ఆరోజు పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. వాదనలు ఆరోజు పూర్తి కావడంతో వాయిదా వేసిన న్యాయస్థానం.. బెయిల్ మంజూరు చేసింది.
స్కిల్ కేసులో టీడీపీ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు.. ఈ మేరకు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. రెగ్యులర్ బెయిల్ రావడంతో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న కొన్ని నిబంధనలు కూడా తొలగిపోయినట్లే అని లాయర్లు అంటున్నారు. కేసుకు సంబంధించిన అంశాలపై కోర్టు ఎలాంటి షరతులు విధించింది అన్నది క్లారిటీ రావాల్సి ఉంటుంది.
ఈ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. రాజకీయంగా పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్లు వాదించారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా.. చంద్రబాబుపై రాజకీయ కక్షతో తప్పుడు కేసులు నమోదు చేశాయన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని కోర్టులో వాదనలు వినపించారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదన్నారు చంద్రబాబు తరఫు లాయర్లు.
చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ నిబంధనల్ని ఉల్లంఘించారని సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారన్నారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవని.. బెయిలు మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదన్నారు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలని.. మధ్యంతర బెయిలు పొందిన చంద్రబాబు.. హైదరాబాద్ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారన్నారు. ఈ ర్యాలీపై బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారన్నారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిలు మంజూరయిందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిలు ఇవ్వాలని లాయర్లు కోరడం సరికాదన్నారు. అందువల్ల బెయిలు పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.
సుదీర్ఘ వాదనలు విన్న ఏపీ హైకోర్టు నవంబర్ 16న తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సోమవారం ( నవంబర్ 20) చంద్రబాబు బెయిల్‌పై తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.