న్యూఢిల్లీ: చిరిగిన రూ.10 నోటు తీసుకోవడానికి నిరాకరించినందుకు కస్టమర్ దాడి చేశాడనే ఆరోపణలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ డెలివరీ బాయ్ సమీర్ హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషం తాగిన అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 20న తుదిశ్వాస విడిచాడు. తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ అతను మరణానికి ముందు రికార్డ్ చేసిన వీడియోలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని వినోద్ నగర్లో అక్టోబర్ 4వ తేదీ రాత్రి సుమారు 10:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రాంపాల్ సింగ్ అనే కస్టమర్‌కు సుమారు రూ.150 విలువైన కాఫీ ఆర్డర్‌ను అందించేందుకు సమీర్ వెళ్లాడు. ఆర్డర్‌కు సంబంధించిన నగదు చెల్లించడానికి కస్టమర్ దాదాపు 15 నిమిషాలు తీసుకున్నప్పటికీ తాను అభ్యంతరం చెప్పలేదని సమీర్ తన వీడియోలో పేర్కొన్నాడు.
అయితే, కస్టమర్ ఇచ్చిన చిరిగిన రూ.10 నోటును మార్చి ఇవ్వాలని మర్యాదగా కోరినందుకు అతను దురుసుగా ప్రవర్తించాడని సమీర్ ఆరోపించాడు. అంతేకాకుండా, తనను మూడుసార్లు చెంపదెబ్బ కొట్టాడని తెలిపాడు. తాను తిరిగి దాడి చేయలేదని, కానీ తన పేదరికాన్ని ఎగతాళి చేయడం తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
తన మరణానికి ముందు రికార్డ్ చేసిన వీడియోలో సమీర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. సొంతంగా సంపాదించుకుని జీవించాలనే ఉద్దేశంతో తండ్రిని డబ్బులు అడిగేవాడిని కాదని చెప్పాడు. తనకు న్యాయం జరుగుతుందా లేదా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశాడు.తనకు వాహనం లేకపోవడంతో సైకిల్‌పై ఆర్డర్లు డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్నానని తెలిపాడు. తక్కువ ఆహారం తిన్నా, తన కష్టార్జితంతోనే బతకాలని కోరుకుంటానని చెప్పాడు.
మరో వీడియోలో సమీర్ తనపై జరిగిన వేధింపులకు కస్టమర్‌తో పాటు అతని మనవడు రాకేష్‌ను బాధ్యులుగా పేర్కొన్నాడు. తనకు ఏదైనా జరిగితే వారిద్దరే కారణమని ఆరోపించాడు. ఘటన అనంతరం కస్టమర్ భార్య క్షమాపణ చెప్పమని కోరినప్పటికీ, తనకు జరిగిన అవమానానికి అది పరిష్కారం కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
తన తల్లిని ఉద్దేశించి మాట్లాడిన వీడియోలోనూ తన మానసిక వేదనను వెల్లడించాడు. పేదరికం కారణంగా జీవితాంతం అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నాడు. తనకు మద్దతుగా నిలిచిన తోటి గిగ్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపాడు.
అక్టోబర్ 5న సమీర్ విషం తాగిన వెంటనే అతడిని ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, అక్టోబర్ 20న చికిత్స పొందుతూ మరణించాడు. సమీర్ తల్లి కలీమా మాట్లాడుతూ, తన కుమారుడి పేదరికాన్ని ఎగతాళి చేశారని ఆరోపించారు. నిందితుడికి రాజకీయ సంబంధాలు ఉన్నాయని, తనకు ఎలాంటి శిక్ష పడదని బెదిరించినట్లు కూడా ఆమె ఆరోపించారు.ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
